NTV Telugu Site icon

మరపురాని అభినేత్రి… శ్రీవిద్య

(జూలై 24న శ్రీవిద్య జయంతి)

ముద్దుగా బొద్దుగా ఉన్నా, మురిపించే అభినయం, ఆకట్టుకొనే అందంతో శ్రీవిద్య అలరించారు. దక్షిణాది అన్ని భాషల్లోనూ శ్రీవిద్య తనదైన నటనతో మురిపించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన “తాత-మనవడు, తూర్పు-పడమర, బంట్రోతు భార్య, బలిపీఠం, కన్యా-కుమారి” వంటి చిత్రాలతో తెలుగునాట మంచి గుర్తింపు సంపాదించారు. తరువాతి తరం హీరోలకు తల్లిగా నటించి అలరించారు. ఆమె నటించిన పలు అనువాద చిత్రాలు సైతం జనాన్ని మెప్పించాయి.

శ్రీవిద్య తల్లి ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎమ్.ఎల్.వసంతకుమారి, ఆమె తండ్రి తమిళ చిత్రాలలో హాస్యనటునిగా మెప్పించిన వికటమ్ ఆర్.కృష్ణమూర్తి. శ్రీవిద్య పుట్టిన తరువాత కృష్ణమూర్తి అనారోగ్యం పాలయి, నటనకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. దాంతో వసంతకుమారి సంపాదనతోనే బతుకుబండి నడచింది. పద్నాలుగేళ్ళ ప్రాయంలోనే శ్రీవిద్య చిత్రసీమలో అడుగు పెట్టాల్సి వచ్చింది. అప్పటి నుంచీ పలు తమిళ చిత్రాలలోనూ, మళయాళ సినిమాల్లోనూ నటిస్తూ వచ్చారు. దాసరి నారాయణరావు తొలి చిత్రం ‘తాత-మనవడు’లో “రాయంటి నా మొగుడు రంగమెల్లి రాలేదు…” అనే ఐటమ్ సాంగ్ లో నర్తించింది శ్రీవిద్య. తరువాత “నిజం చెబితే నమ్మరు, బంట్రోతు భార్య, గాలిపటాలు” వంటి సినిమాల్లో నటించాక యన్టీఆర్ ‘కథానాయకుని కథ’లో ఆయనకు చెల్లెలుగా నటించారు. ‘రాముని మించిన రాముడు’లో యన్టీఆర్ సరసన ఓ నాయికగా కనిపించారు. ‘తూర్పు -పడమర’లో శ్రీవిద్య అభినయం ఆకట్టుకుంది. దాంతో తెలుగు చిత్రాలలోనూ ఆమెకు అవకాశాలు పలకరించాయి. బాలకృష్ణ “ఇన్ స్పెక్టర్ ప్రతాప్, రాముడు-భీముడు, బంగారు బుల్లోడు, గాండీవం” చిత్రాలలోనూ, చిరంజీవి “కొండవీటి దొంగ, ముగ్గురు మొనగాళ్ళు”లోనూ, వెంకటేశ్ “బ్రహ్మపుత్రుడు, ధర్మచక్రం, చిన్నబ్బాయి”లోనూ, నాగార్జున ‘విక్కీదాదా’లోనూ ఆమె కీలక పాత్రలు పోషించారు. “ఇంద్రుడు-చంద్రుడు, బలరామకృష్ణులు, అమ్మకొడుకు, పరువు-ప్రతిష్ఠ, నేను ప్రేమిస్తున్నాను, తాళి, మాతల్లి గంగమ్మ” వంటి సినిమాల్లోనూ శ్రీవిద్య అభినయించారు. “జైసే కో తైసా, అర్జున్ పండిట్” అనే రెండు హిందీ చిత్రాల్లోనూ శ్రీవిద్య నటించారు. తల్లి ఎమ్.ఎల్. వసంతకుమారిప్రఖ్యాత కర్నాటక సంగీత గాయని కావడంతో శ్రీవిద్య కూడా కొంత సాధన చేశారు. దాంతో కొన్ని తమిళ, మళయాళ చిత్రాలలో గాయనిగానూ రాణించారామె.

శ్రీవిద్య – కమల్ జోడీ!

శ్రీవిద్య, కమల్ హాసన్ జంట కొన్ని చిత్రాలలో జనాన్ని అలరించింది. ముఖ్యంగా బాలచందర్ తెరకెక్కించిన ‘అపూర్వ రాగంగళ్’లో శ్రీవిద్య, కమల్ జోడీ ఆకట్టుకుంది. నిజానికి ఈ చిత్రంలో రజనీకాంత్ భార్యగా శ్రీవిద్య నటించారు. అలా రజనీకాంత్ తొలి హీరోయిన్ గా నిలచిపోయారు శ్రీవిద్య. కమల్, శ్రీవిద్య “సొల్లదాన్ నినెక్కిరైన్, ఉనర్చిగళ్” చిత్రాలలోనూ మెప్పించారు. అదే సమయంలో కమల్ హాసన్ అంటే శ్రీవిద్య ప్రేమ పెంచుకుంది. కానీ, కమల్, వాణీగణపతిని పెళ్ళాడడంతో తన ప్రేమను తనలోనే దాచుకుంది. తరువాతి రోజుల్లో కమల్, శ్రీవిద్య మంచి స్నేహితులుగా ఉన్నారు. శ్రీవిద్య, జార్జ్ థామస్ అనే మళయాళ దర్శకుణ్ణి పెళ్ళాడారు. అయితే వారి వివాహబంధం చాలా కాలం కొనసాగలేదు. కమల్ నటించిన “విచిత్ర సోదరులు, ఇంద్రుడు-చంద్రుడు” వంటి చిత్రాలలో ఆయన సరసన నటించారు శ్రీవిద్య. ఆమె చివరి రోజుల్లోనూ ఆసుపత్రికి వెళ్ళి కమల్ హాసన్ ఊరట కలిగించారు. ఏది ఏమైనా తనదైన అభినయంతో అందంగా ఆకట్టుకున్నారు శ్రీవిద్య.