NTV Telugu Site icon

యాక్షన్ కు మారుపేరు అర్జున్!

(ఆగస్టు 15న అర్జున్ జన్మదినోత్సవం)

పోరాట సన్నివేశాల్లో తనదైన బాణీ పలికిస్తూ ‘యాక్షన్ కింగ్’ అనిపించుకున్నారు అర్జున్ సర్జా. ఆయన కుటుంబ సభ్యుల్లో చాలామంది సినిమా రంగానికి చెందినవారే. నటునిగా, దర్శకునిగా, నిర్మాతగా సాగుతున్న అర్జున్ స్వాతంత్ర్య దినోత్సవాన జన్మించడం వల్ల తనలో దేశభక్తిని నింపుకొనీ చిత్రాలను రూపొందించారు. ఆయన చేతిపై మన మువ్వన్నెల జెండా పచ్చబొట్టు కూడా కనిపిస్తుంది. తెలుగునాట ‘మా పల్లెలో గోపాలుడు’గా అవతరించకముందే కొన్ని కన్నడ అనువాద చిత్రాల ద్వారా అర్జున్ తెలుగువారికి సుపరిచితుడే. యాక్షన్ స్టార్ గా తెలుగునాట సైతం అర్జున్ జయకేతనం ఎగురవేశారు. అనేక చిత్రాలలో డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ లో భళా అనిపించిన అర్జున్ ‘యాక్షన్ కింగ్’ గా నిలచిపోయారు.

కన్నడ చిత్రసీమలో కేరెక్టర్ యాక్టర్ గా ఎంతో పేరున్న నటుడు శక్తి ప్రసాద్. ఆయన అసలు పేరు జె.సి.రామస్వామి. స్వతహాగా ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేయడంతో తన తనయులు కిశోర్ సర్జా, అర్జున్ సర్జా ఇద్దరినీ యాక్షన్ హీరోలుగా తీర్చిదిద్దారు. ఈ ఇద్దరు తండ్రి పేరు నిలుపుతూ యాక్షన్ సీన్స్ లో నటించేవారు. కిశోర్ సర్జా డైరెక్టర్ గా కూడా రాణించారు. అర్జున్ యాక్షన్ సీన్స్ చూసిన కోడి రామకృష్ణ, నిర్మాత ఎస్ .గోపాల్ రెడ్డి తమ ‘మా పల్లెలో గోపాలుడు’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం మూడు థియేటర్లలో స్వర్ణోత్సవం జరుపుకుంది. దాంతో తెలుగు చిత్రసీమలోనూ అర్జున్ కు అవకాశాలు మొదలయ్యాయి. “టెర్రర్, బంగారు చిలక, నాగదేవత, ప్రతిధ్వని, కోటిగాడు, కోనసీమ కుర్రోడు, త్రిమూర్తులు, మొనగాడు” వంటి చిత్రాలతో తెలుగువారిని అలరించారు. తరువాత తెలుగులో ఫ్లాపులు పలకరించగానే, తమిళ చిత్రాలపై దృష్టిని కేంద్రీకరించారు అర్జున్. దర్శకుడు బి.గోపాల్ తొలి చిత్రం ‘ప్రతిధ్వని’లో కథానాయకునిగా నటించిన అర్జున్, తమిళ దర్శకుడు శంకర్ మొదటి సినిమా ‘జెంటిల్ మేన్’లోనూ హీరోగా అలరించారు. అలా కొందరు దర్శకులకు ఈ యాక్షన్ కింగ్ సెంటిమెంట్ గా మారారు. అర్జున్ భార్య నివేదిత కూడా నటి. ఆయన కూతురు ఐశ్వర్య కూడా కన్నవారి బాటలో పయనిస్తూ నటనను ఎంచుకుంది.

తెలుగులో కొంత గ్యాప్ తరువాత అర్జున్ తనకు తొలి ఘనవిజయం చూపించిన కోడి రామకృష్ణ ‘పుట్టింటికి రా చెల్లి’చిత్రంలో నటించారు . ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. అంతకు ముందు “ద్రోహి, శుభవార్త, శ్రీమంజునాథ” వంటి ద్విభాషా చిత్రాల్లోనూ అభినయించారు. జగపతిబాబుతో కలసి ‘హనుమాన్ జంక్షన్’లో నటించారు అర్జున్. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత నుంచీ అర్జున్, జగపతిబాబు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. “శ్రీఆంజనేయం, రామ రామ కృష్ణ కృష్ణ, లై, నా పేరు సూర్య”వంటి చిత్రాల్లోనూ అర్జున్ ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపించారు. రవితేజ హీరోగా రూపొందిన ‘ఖిలాడీ’లోనూ అర్జున్ ఓ ముఖ్య పాత్ర ధరించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇలా తెలుగువారితో తన అనుబంధం కొనసాగిస్తూనే ఉన్నారు అర్జున్. ఈ యేడాదితో 59 ఏళ్ళు పూర్తి చేసుకొని 60 ఏట అడుగు పెట్టనున్నారు. అయినా, ఇప్పటికీ అదే ఎనర్జీతో కనిపించే అర్జున్ ను చూస్తే రియల్ ‘యాక్షన్ కింగ్‌’ అనకుండా ఉండలేం.