(ఆగస్టు 1న ‘రాణికాసుల రంగమ్మ’)
చిరంజీవి ‘మెగాస్టార్’ కాకముందు శ్రీదేవితో కలసి రెండు సినిమాల్లో చిందేశారు. అందులో ఒకటి శోభన్ బాబు హీరోగా రూపొందిన ‘మోసగాడు’. అందులో చిరంజీవి విలన్ గా నటించారు. ఆ సినిమాలో శ్రీదేవితో కలసి చిరంజీవి వేసిన చిందు అలరించింది. ఆ తరువాత కూడా చిరంజీవిని కాసింత నెగటివ్ షేడ్స్ లో చిత్రీకరించి, ఆయనకు జోడీగా శ్రీదేవితో రూపొందిన చిత్రం ‘రాణికాసుల రంగమ్మ’. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాశరావు నిర్మాతకాగా, ఆయన తనయుడు టి.ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించారు. తరువాతి రోజుల్లో ఈయన తాతినేని ప్రసాద్ గా సుప్రసిద్ధులు. ఈ చిత్రం 1981 ఆగస్టు 1న విడుదలయింది.
కథ విషయానికి వస్తే – ఓ తండ్రి తన తనయుణ్ణి బాగా చదివించి, ప్రయోజకుణ్ణి చేశాననుకుంటాడు. తండ్రికి వయసు మళ్ళిన తరువాత ఓతోడు ఉంటే బాగుంటుందని తనయుడు సుకుమార్ భావిస్తాడు. తండ్రిని మరో పెళ్ళి చేసుకోమంటాడు. ఆయన అందుకు అంగీకరించడు. ఇక సుకుమార్ ఓ పల్లెటూరు వెళ్ళి, అమాయకురాలయిన రాణికాసుల రంగమ్మను మానభంగం చేస్తాడు. తనను పెళ్ళాడమని కాళ్ళావేళ్ళా పడుతుంది రంగమ్మ. ఆమెను నూతిలోకి తోస్తాడు. చచ్చిపోయిందను కుంటాడు. అచ్చు అలాగే ఉన్న రోజా అనే అమ్మాయి వాళ్ళ ఆఫీసులో స్టెనోగా చేరుతుంది. ఆమెను చూసి ఆశ్చర్యపోయిన సుకుమార్ పల్లెటూరు వెళ్ళి వాకబు చేస్తాడు. అక్కడ రాణికాసుల రంగమ్మ తారసపడుతుంది. ఇక తండ్రి, తనకు తోడు కోసమై ఆఫీసులో పనిచేసే రోజాను పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. పెళ్ళికూతురుగా వచ్చిన రోజాను సుకుమార్ నిలదీస్తాడు. ఆమె రాణికాసుల రంగమ్మ అని ఒప్పుకుంటుంది. ఆమె మంచిది కాదని చెబుతాడు. ఎందువల్ల అంటే అసలు విషయం చెప్పడంతో సుకుమార్ లో మార్పు రావాలనే తాను నాటకం ఆడానని తండ్రి చెబుతాడు. చివరకు రంగమ్మ మెడలో సుకుమార్ తాళి కట్టక తప్పదు.
రాణికాసుల రంగమ్మగా శ్రీదేవి, సుకుమార్ గా చిరంజీవి, ఆయన తండ్రిగా జగ్గయ్య నటించారు. ఈ చిత్రంలోని కొంత కథ శ్రీదేవి నటించిన ‘పదహారేళ్ళ వయసు’ గుర్తుకు తెస్తుంది. మరికొంత ‘కవిత’ సినిమాను తలపిస్తుంది. మిగిలిన పాత్రల్లో నూతన్ ప్రసాద్, అల్లు రామలింగయ్య, రాళ్ళపల్లి, జయమాలిని కనిపిస్తారు. ఈ చిత్రానికి దాసం గోపాలకృష్ణ మాటలు రాయగా, వేటూరి, దాసం గోపాలకృష్ణ పాటలు పలికించారు. చక్రవర్తి స్వరకల్పన చేశారు. ఇందులో “మదిలోని మంగమ్మ…”, “అందంగా ఉన్నావు…”, “ఏరెత్తుకెళ్ళింది రయికా…”, “లింగూ లిటుకు… లింగూ లిటుకు…” పాటలు ఆకట్టుకున్నాయి.