NTV Telugu Site icon

40 ఏళ్ళ ‘రగిలే జ్వాల’


తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ‘విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్’ తనకంటూ ఓ ప్రత్యే క స్థానం సంపాదించింది. మహానటుడు యన్టీఆర్ తో ‘జస్టిస్ చౌదరి’ చిత్రం నిర్మించి ఘనవిజయం సాధించారు విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ అధినేత టి.త్రివిక్రమరావు. ఆయన తొలి చిత్రం శోభన్ బాబు హీరోగా తెరకెక్కిన ‘మొనగాడు’. తరువాత శోభన్ బాబుతోనే ‘బంగారు చెల్లెలు’ నిర్మించారు. ఆ పై కృష్ణతో ‘ఘరానాదొంగ’, ఆ తరువాత కృష్ణంరాజుతో ‘రగిలే జ్వాల’ నిర్మించారు. ఈ సినిమాల తరువాతే రామారావుతో ‘జస్టిస్ చౌదరి’ నిర్మించి, తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు టి.త్రివిక్రమరావు. తరువాతి రోజుల్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోస్ తోనూ టి.త్రివిక్రమరావు సినిమాలు నిర్మించి అలరించారు. ‘రగిలేజ్వాల’ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకుడు. 1981 ఆగస్టు 7న విడుదలైన ‘రగిలేజ్వాల’ ప్రేక్షకాదరణ చూరగొంది.

‘రగిలే జ్వాల’లో కృష్ణంరాజు తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. కథ విషయానికి వస్తే, పెద్దగా చదువుకోని మనసున్న మనిషి కృష్ణను లక్ష్మి అనే కోటీశ్వరుని మనవరాలు ప్రేమిస్తుంది. ఆమెను మేనమామ పేకాట పిచ్చి ధర్మరాజు ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటే, లేచిపోయి గుడిలో కృష్ణను పెళ్ళాడుతుంది. ఓ బాబు పుడతాడు. కృష్ణను ధర్మరాజు ఓ పథకం ప్రకారం జైలుకు పంపిస్తాడు. ధర్మరాజు, లక్ష్మి తనకు లొంగలేదని ఇంటికి నిప్పు పెట్టిస్తాడు. జైలులో ఉన్న కృష్ణకు ఈ విషయం తెలిసి, తప్పించుకొని వచ్చి ధర్మరాజును చంపబోతాడు.

పోలీసులు వెంట పడతారు. తప్పించుకొని ఓ జమీందార్ ఇంట తలదాచుకుంటాడు. ఆయనకు ఓ పసిపాప దొరికి ఉంటుంది. ఆ పసిపాపను కృష్ణకు అప్పగించి కన్నుమూస్తాడు ఆ జమీందార్. ఆ పాపను సొంతకూతురులా పెంచిపెద్ద చేస్తాడు కృష్ణ. మరోవైపు లక్ష్మి తన కొడుకు రాజాను పోలీసాఫీసర్ ను చేస్తుంది. చివరకు తన తండ్రి నిర్దోషి అని నిరూపించడంలో రాజా సఫలీకృతుడవుతాడు. కృష్ణ పెంచిన వాణీని రాజా ప్రేమించి ఉంటాడు. రాజా, వాణి పెళ్ళి చేయాలనుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

కొన్ని హిందీ చిత్రాల పోకడలు ఈ కథలో కనిపిస్తాయి. సత్యానంద్ రచన చేయగా, ఆత్రేయ, వేటూరి పాటలు పలికించారు. చక్రవర్తి స్వరకల్పనలో రూపొందిన “ముద్దబంతి పువ్వమ్మా… పొద్దు పొడుపు నవ్వమ్మా…”, “తోటమాలిని… పూల బాటసారిని…”, “ఎన్నెల్లో తాంబూలాలు… ఏందయ్యో పేరంటాలు…” , ” నా జీవన జ్యోతివి నీవే… ఈ కోవెల హారతి నీవే…”, “చినుకు పడితే చిచ్చురేగి…” , “తోపు కాడ కొస్తావా పిల్లో…” వంటి పాటలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో సుజాత, జయప్రద, రావు గోపాలరావు, నాగభూషణం, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, గిరిబాబు, జగ్గయ్య, పుష్పలత, జయమాలిని, పొట్టిప్రసాద్, సుత్తివీరభద్రరావు తదితరులు నటించారు. ఆ రోజుల్లో ‘రగిలే జ్వాల’ మంచి ఆదరణ పొందింది.