NTV Telugu Site icon

35 ఏళ్ళ ‘చంటబ్బాయ్’

Chantabbai Movie

Chantabbai Movie

(ఆగస్టు 22న ‘చంటబ్బాయ్’ 35 ఏళ్ళు పూర్తి)

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఆయన పుట్టినరోజయిన ఆగస్టు 22న విడుదలైన ఏకైక చిత్రం ‘చంటబ్బాయ్’. జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఒకే ఒక్క చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఈ చిత్రాన్ని జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భీమవరపు బుచ్చిరెడ్డి నిర్మించారు. ప్రముఖ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ‘చంటబ్బాయ్’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆద్యంతం హాస్యంతో సాగే ఈ సినిమాలో చివరలో కాసేపు కరుణ రసం కురుస్తుంది. చిరంజీవి కామెడీతో కదం తొక్కగలను అని నిరూపించుకున్నారు. అయితే ఈ సినిమా జనాన్ని ఎందుకనో అంతగా ఆకట్టుకోలేక పోయింది. కానీ, ఈ చిత్రం బుల్లితెరపై ప్రత్యక్షమైనప్పుడు మాత్రం జనం ఆసక్తిగా చూస్తూనే ఉండడం గమనార్హం!

‘చంటబ్బాయ్’ కథ విషయానికి వస్తే – గంగాధరం అనే ఆయన తన మొదటి భార్యను వదిలేసి ఉంటాడు. తరువాత మరో పెళ్ళి చేసుకొని కోటీశ్వరుడై పోతాడు. డాక్టర్ నిశ్చల ఆయన కూతురు. ఆమె స్నేహితురాలు జ్వాల. టెటిఫోన్ సర్వీస్ లో పనిచేస్తుంటుంది జ్వాల. ఆమె అంటే డిటెక్టివ్ పాండుకు ఎంతో అభిమానం. ఓ సారి ఆమె చేయని నేరంలో ఇరుక్కుపోతే పాండు తన తెలివితేటలతో కాపాడతాడు. అప్పటి నుంచీ వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. గంగాధరంకు తన మొదటి భార్య వల్ల ఓ కొడుకు ఉన్నాడని, అతని పేరు చంటబ్బాయ్ అని తెలుస్తుంది. అతను ఎక్కడ ఉన్నాడో పరిశోధించి, పట్టుకు వచ్చే బాధ్యతను డిటెక్టివ్ పాండుకు అప్ప చెబుతారు. పలువురు తామే చంటబ్బాయిలమంటూ వస్తారు. చివరకు పాండునే అసలైన చంటబ్బాయ్ అని ఓ ఆమె ద్వారా తెలుస్తుంది. తాను పడ్డ కష్టాలన్నిటినీ జ్వాల, నిశ్చలకు చెబుతాడు. తనలాంటి పేదవాడు కోటీశ్వరుని కొడుకు కాలేడని అంటాడు. అయితే తండ్రి తనను క్షమించమని కోరాక, చంటబ్బాయ్ ఇంటికి వెళ్ళడంతో కథ సుఖాంతమవుతుంది.

‘చంటబ్బాయ్’లో డిటెక్టివ్ పాండు, అతని అసిస్టెంట్ గణపతి చేసే కామెడీ కితకితలు పెడుతుంది. ఇక చంటబ్బాయిలం మేమేనంటూ వచ్చిన వారి గోల, వారి భార్యల్లో ఒకామె కవితల రొద అన్నీ నవ్వులు పంచుతాయి. డిటెక్టివ్ పాండుగా చిరంజీవి నటించిన ఈ చిత్రంలో సుహాసిని, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు, జగ్గయ్య, రావి కొండలరావు, అల్లు రామలింగయ్య, భీమరాజు, చంద్రమోహన్, సుధాకర్, శ్రీలక్ష్మి తదితరులు నటించారు. నేటి ప్రముఖ నిర్మాత, చిరంజీవి బావ అల్లు అరవింద్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించి నవ్వులు పూయించారు.

ఈ చిత్రానికి జంధ్యాల మాటలు, దర్శకత్వం నిర్వహించారు. చక్రవర్తి స్వరకల్పనలో వేటూరి రాసిన పాటలు కొన్ని అలరించాయి. ముఖ్యంగా చార్లీ చాప్లిన్ గెటప్ లో చిరంజీవి కనిపించిన “అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను…” అనే పాట జనాన్ని బాగా ఆకట్టుకుంది. అప్పట్లో చిరంజీవి మాస్ హీరోగా సక్సెస్ రూటులో సాగిపోతున్నారు. అలాంటి సమయంలో ఆయన నటించిన ‘చంటబ్బాయ్’ వంటి కామెడీ మూవీ జనాన్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది.