NTV Telugu Site icon

Pavitra – Chandu: ‘పవిత్ర’ ప్రేమనుకోవాలా..? వ్యామోహమనుకోవాలా?

Chandu Pavitra Love Story

Chandu Pavitra Love Story

Special Focus on Serial Artists Chandu Suicide and Pavitra Death: ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా భర్తను కాదనుకుని వెళ్లిందో భార్య!! తనకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి మరచి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కాదనుకుని వెళ్లాడో భర్త!! సమాజం ఏమనుకున్నా సరే.. కలిసుందామనుకున్నారు. ప్రేమానురాగాలతో కలిసి ఉన్నారు. కొన్నేళ్లుగా సాఫీగా సాగుతున్న వీళ్ల కొత్త కాపురంలో విధి వక్రీకరించింది. రోడ్డు ప్రమాదంలో ఒకరిని బలి తీసుకోగా… తాను లేని జీవితం నాకెందుకుని తనువు చాలించుకునేలా చేసింది.

Hema: బెంగళూరు రేవ్ పార్టీ.. పోలీసులతో వివాదం.. మరో వీడియో పోస్ట్ చేసిన హేమ

సీరియల్‌ నటులు పవిత్ర, చందు వరుస మరణాలతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. వారి గతాన్ని పక్కనపెడితే… వీరి జంటను చూసి కుళ్లుకునేవాళ్లు. పవిత్ర, చందుల ప్రేమగాథ తెలియనివారు లేరు. విధి ఆడిన వింత నాటకంలో… ఈ ఇద్దరు అమర ప్రేమికులు బలయ్యారు. రోడ్డు ప్రమాదంలో పవిత్ర చనిపోగా చందు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. త్రినయిని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం వంటి సీరియల్స్‌లో నటించిన చంద్రకాంత్‌ నిన్న తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం బుల్లితెర ఇండస్ట్రీని విషాదంలో నింపింది. సహనటి పవిత్ర జయరాంతో ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్న చందు ఆమె హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. పవిత్రతో కలిసి బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా మహబూబ్‌నగర్ జిల్లా శేరిపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అదే కారులో ఉన్న చంద్రకాంత్ గాయాలతో బయటపడ్డాడు. ప్రేయసి మరణం చందుని పిచ్చివాడిని చేసింది. రెండ్రోజుల క్రితం పవిత్ర పుట్టినరోజు సందర్భంగా ఆమె నన్ను పిలుస్తోంది అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు. ఇంతలోనే ఆత్మహత్య చేసుకొని కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు.

చందు, పవిత్రల సహజీవనం కంటే ముందే వీరిద్దరికీ పెళ్లిళ్లు అయ్యి పిల్లలు కూడా ఉన్నారు, పవిత్రకు ఇద్దరు పిల్లలు, చందుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చందు శిల్పను 11 ఏళ్ల పాటు ప్రేమించి ఇంట్లో పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే… చందుకు పవిత్ర పరిచయం అవడంతో… వాళ్ల జీవితాలే మారిపోయాయి. పరిచయం.. ప్రేమగా మారింది. అనతికాలంలోనే ప్రేమ కాస్త.. సహజీవనంగా మారింది. చందు తన భార్య శిల్పను వదిలేశాడు. పవిత్ర అప్పటికే తన భర్త జయరాంకు దూరంగా ఉంటోంది. చందు, పవిత్రలు ఒక్కటయ్యారు. ఇద్దరూ కలిసే ఉంటున్నారు. వీళ్ల బంధానికి పవిత్ర పిల్లలు కూడా అడ్డు చెప్పలేదు. చంద్రకాంత్‌ తో పవిత్ర పిల్లలు కూడా బాగానే ఉంటున్నారు.

ఎప్పుడైతే పవిత్ర చందు జీవితంలోకి ఎంటర్‌ అయిందో అప్పటి నుంచి మా మధ్య చాలా దూరం పెరిగిందని ఆవేదన చెందుతోంది భార్య శిల్ప. ప్రేమించి పెళ్లి చేసుకున్న తనను కాదని… ఇద్దరు పిల్లలను కూడా తండ్రి లేని అనాథలు చేసి వెళ్లినా… తాను అడ్డు చెప్పలేదంటోంది శిల్ప. భర్త చందు ఎక్కడో దగ్గర సంతోషంగా ఉంటే చాలనుకున్నానని రోదిస్తోంది. పవిత్ర మరణం తర్వాత తీవ్ర మానసిక కుంగుబాటుకు గురైన చందును సాధారణ స్థితికి తెచ్చేందుకు కూడా ప్రయత్నించినా… నా భర్త నాకు దక్కలేదని కన్నీరు మున్నీరవుతోంది శిల్ప.

ఆత్మహత్య చేసుకున్న సీరియల్ నటుడు చందుకి గతంలో పెళ్లైంది. అది కూడా ప్రేమ వివాహం. స్కూల్ డేస్‌ నుంచే ప్రేమ పేరుతో శిల్ప వెంటపడ్డాడు చందు. ఆమె ఓకే చెప్పడంతో ఇంట్లో ఒప్పించి 2015లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఖాళీగా ఉంటున్న చందుకి సాఫ్ట్‌వేర్ కంపెనీ కూడా పెట్టించింది భార్య శిల్ప. ఓ సీరియల్‌లో ఆఫర్ రావడంతో ఆ కంపెనీని వదిలేసి వెళ్లిపోయాడు చందు. అక్కడే పవిత్ర పరిచయమైంది. ఆమెకు అప్పటికే కాలేజీ చదివే ఇద్దరు పిల్లలున్నారు. ఆమె మోజులో పడ్డ చందు… తన కుటుంబాన్ని పక్కన పెట్టారు. పవిత్ర ప్రేమలో మునిగిపోయాడు. భార్య పిల్లలను వదిలేసి పవిత్రతో సహజీవనం చేశాడు. విడాకుల కోసం భార్యను ఒత్తిడి చేశాడు.

సమాజం ఏం అనుకుంటుంది… బంధువులు ఏమనుకుంటారు.. స్నేహితులు, సన్నిహితుల సూటిపోటి మాటలు అన్నీ పక్కన పెట్టారు. ఇద్దరూ కలిసిమెలిసి ఉంటున్నారు. అంతా సాఫీగా సాగుతోంది అనుకుంటున్న తరుణంలో.. విధి వక్రీకరించింది. ఇంతలోనే ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర చనిపోయింది. బెంగళూరు వెళ్లి కారులో తిరిగి వస్తుండగా… మహబూబ్నగర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర స్పాట్‌ లోనే చనిపోయింది. ప్రమాద సమయంలో చందు కూడా పవిత్ర పక్కనే ఉన్నాడు. గాయాలతో బయట పడ్డాడు. అప్పటి వరకు కారులో తన పక్కనే ఉంటూ… ముచ్చటిస్తూ వచ్చిన పవిత్ర… రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూడలేకపోయాడు. పవిత్ర మరణంతో… చందు డిప్రెషన్‌లోకి వెళ్లాడు. పవిత్ర లేనిది తాను బతకలేనని… నిత్యం సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ ఉన్నాడు.

ఇవాళ పవిత్ర పుట్టినరోజు… నన్ను రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు చందు. పవిత్ర మరణం తట్టుకోలేక చందు బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌ మణికొండలోని అల్కాపూర్ కాలనీలో గల తమ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. త్రినయిని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం తదితర TV సీరియల్స్‌లో నటించాడు చందు. పవిత్ర మరణం తర్వాత ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు బ్రెయిన్ సంబంధ వ్యాధి ఉన్నట్లు… త్వరలోనే తాను చనిపోతా అని చెప్పడం కూడా సంచలనంగా మారింది.
.
గత కొన్ని రోజులుగా పవిత్రతో తన వీడియోలు, ఫొటోలకు ఎమోషనల్‌ సాంగ్స్‌తో సోషల్‌ మీడియాలలో పోస్టులు పెడుతున్నాడు చందు. నా పవి ఇక లేదు… ప్లీజ్‌ వెనక్కు వచ్చే అని ఓ పోస్టు పెట్టాడు చందు. అలాగే, చనిపోయే ముందు కూడా పవిత్రతో దిగిన సెల్ఫీని పోస్టు చేశాడు. పాపా నీతో దిగిన లాస్ట్ పిక్ రా అని క్యాప్షన్‌ పెట్టాడు చందు. నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను… ఒక సారి మామ అని పిలవా… అని పోస్టు పెట్టాడు.

చందు పెట్టిన పోస్టులు చూసి… అతన్ని వారించే ప్రయత్నం చేశారు స్నేహితులు. అయితే, తాను పిచ్చివాడిగానో… తాగుబోతుగానే మారిపోతే ఇంట్లో వాళ్లు ఇబ్బందిపడతారన్నాడు చందు. ఈ జన్మ ఇక చాలు… నేను వెళ్లిపోతాను అని వాళ్లకు స్పష్టం చేశాడు. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.

తానొకటి తలిస్తే విధి మరొకటి తలచింది..!
ప్రియుడికి ప్రేయసిని దూరం చేస్తే… భార్యకు భర్తను… పిల్లలకు తండ్రిని దూరం చేసింది!!
విధి ఆడిన వింత నాటకంలో చివరకు చిన్నారులు అనాథలయ్యారు.
అడ్డూ అదుపు లేని సహ జీవనాలు పండంటి కాపురాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. తాజాగా సీరియల్‌ నటులు పవిత్ర, చందు మరణాలు కూడా ఇందుకు నిదర్శనంగా మిగులుతున్నాయి. వీళ్లది పవిత్ర ప్రేమనుకోవాలా..? భార్యను కాదని ఒకరు.. భర్తను కాదని మరొకరు వెళ్లినా.. చివరకు మిగిలింది మాత్రం చితే!