NTV Telugu Site icon

Sirivennela: ఈ ‘సిరివెన్నెల’కు కొలలేదు!

Sirivennela

Sirivennela

Sirivennela: వచ్చీ రాగానే “ఆదిభిక్షువు వాడినేది కోరేది… బూదినిచ్చేవాడినేది అడిగేది…” అంటూ ముక్కంటిని నిందాస్తుతితో ఆరాధించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆ సాహితీ సుగంధానికి పరవశించిన పరమేశ్వరుడు తన దరిన ఉన్న నందిని బంగారు నందులుగా మార్చి పదకొండు సార్లు సిరివెన్నెల ఇంటికి పంపారు. ఇది కదా… సీతారామశాస్త్రి సాధించినది! అనితరసాధ్యంగా నంది అవార్డుల్లో ఉత్తమ గీతరచయితగా 11 సార్లు నందిని అందుకున్న ఘనుడు మన సిరివెన్నెల సీతారాముడు.

“విధాత తలపున ప్రభవించిన… అనాది జీవనవేదాన్ని…” తన పాటలో వినిపించగానే, తొలి నంది ‘సిరివెన్నెల’ చెంత చేరింది. ‘శ్రుతిలయలు’ మీటుతూ “తెలవారదేమో స్వామీ…” అంటూ అన్నమయ్య పదకవితల బాణీలో సాగితే మరో నంది పరుగు తీస్తూ వచ్చి సీతారాముని ఇంటిలో తిష్ట వేసింది. “అందెలరవమిది పదములదా…” అంటూ ‘స్వర్ణకమలం’ అందుకొనే నాట్యమయూరి కోసం గీతం రాస్తే, ముచ్చటగా మూడో నంది సీతారాముని దరిచేరింది. సీతారాముడు తొలుత అందుకున్న మూడు నంది అవార్డులూ కళాతపస్వి కె.విశ్వనాథ్ చిత్రాల ద్వారానే కావడం విశేషం!

రామ్ గోపాల్ వర్మ ‘గాయం’కోసం “సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని?…” అని ప్రశ్నిస్తే మళ్ళీ నంది పరుగు తీస్తూ వచ్చింది. ‘శుభలగ్నం’లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వానికి, సంగీత దర్శకత్వానికి సరిజోడుగా పలికించిన “చిలకా ఏ తోడు లేక…” అంటూ సాగే పాటకు ఇంకో నంది వచ్చి వాలింది. “మనసు కాస్త కలత పడితే…” అంటూ సి.ఉమామహేశ్వరరావు ‘శ్రీకారం’ కోసం కలం కదిలిస్తే మరొక నంది వర్ధనం సిరివెన్నెల ఇంట పూసింది. కృష్ణవంశీని తన దత్త పుత్రుడు అంటూ ప్రేమించే సీతారాముడు, ఆ దత్తపుత్రుడు నిర్మాతగా మారి తొలిసారి తీసిన ‘సిందూరం’ కోసం “అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా…” అంటూ ప్రశ్నిస్తే నంది నాట్యం చేస్తూ వచ్చేసింది.

మరోమారు రామ్ గోపాల్ వర్మ ‘ప్రేమకథ’తో నంది సీతారాముని చేరింది. అందులోని “దేవుడు కరుణిస్తాడని…” అంటూ సాగిన సిరివెన్నెల గీతం విని దేవుడు కరుణించాడు. “జగమంత కుటుంబం నాది…” అంటూ కృష్ణవంశీ ‘చక్రం’లో వేదాంతం ఒలికిస్తే, మరోమారు వేదాంతనిలయుని కరుణ కురిసింది. సిరివెన్నెల ఇంట నంది నర్తనం చేసింది. “ఎంతవరకు ఎందుకొరకు…” అంటూ క్రిష్ తొలి చిత్రం ‘గమ్యం’ కోసం సిరివెన్నెల పదాలు విని పదవ నంది పరుగులు తీస్తూ వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’కోసం “మరి అంతగా…” అంటూ రాగాలు తీసింది సిరివెన్నెల కలం, పదకొండో నంది మరింత వేగంగా ఆయన దరి చేరింది.

శివుడు ఏకాదశ ప్రియుడు- అందుకేనేమో తన భక్తుడైన సీతారామునికి పదకొండు నంది బహుమతులు ప్రసాదించాక తన దరికి చేర్చుకున్నాడు. బహుశా…కైలాసంలో చేరిన ‘బాల’సుబ్రహ్మమణ్యంతో సీతారాముని పాట పాడించాలని కాబోలు అంటూ అభిమానులు భావిస్తున్నారు. సిరివెన్నెల కురిపించిన మధురాన్ని మాత్రం మరచిపోకుండా మననం చేసుకుంటూ ఆనందిస్తున్నారు తెలుగుజనం. అసలు మరచిపోతే కదా! ‘వేడుకకు వెల లేదు… వెన్నెలకు కొలలేదు…’ అన్నట్టు సిరివెన్నెల సీతారాముని మధురాన్ని కొలవగలమా!? ఊటలా ఆ మధురం ఊరుతూనే ఉంటుంది. తెలుగువారికి తరతరాలకు సరిపడా మధురం పంచుతూనే ఉంటుంది.