NTV Telugu Site icon

Sharada Rajan: మూడే పాటలతో పాపులారిటీ!!

Sharada Rajan

Sharada Rajan

ఆవిడ తెలుగులో ఒకే ఒక్క సినిమాలో మూడు పాటలు పాడారు. పాడిన ఆ మూడూ ఈ రోజుకీ సంగీత ప్రియుల నోట వినవస్తూనే ఉన్నాయి. 1971లో ఎన్టీయార్, వాణిశ్రీ జంటగా నటించిన సినిమా ‘జీవిత చక్రం’. ఈ మూవీలో ‘కంటిచూపు చెబుతోంది… కొంటెనవ్వు చెబుతోంది’ పాటతో పాటు ‘కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు…’ పాటనూ, ‘మధురాతి మధురం… మన ప్రేమ మధురం’ గీతాన్ని ఘంటసాలతో కలిసి పాడారు శారదా రాజన్. ఈ సినిమా తర్వాత మరే తెలుగు సినిమాలోనూ ఆవిడ పాటలు పాడలేదు. ‘జీవిత చక్రం’ సినిమాకు శంకర్ జైకిషన్ సంగీతం అందించారు. ఆయన సంగీతం అందించడం వల్లే శారదా రాజన్ ఇందులో పాటలు పాడారు. తమిళనాడుకు చెందిన శారదా రాజన్ అయ్యంగార్ శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించి ముంబైలో లతా మంగేష్కర్ కే గట్టి పోటీ ఇచ్చారు. ఒకానొక సమయంలో శంకర్, జై కిషన్ ద్వయం లత కంటే శారదకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. దీనిపై అలిగిన లతాజీ కొంతకాలం శంకర్ – జై కిషన్ సంగీతంలో రూపొందిన సినిమాల్లో పాటలు కూడా పాడలేదు. శంకర్-జై కిషన్ ద్వయంలో శంకర్ శారదా రాజన్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అది జై కిషన్ కు నచ్చలేదు. దాంతో శంకర్ – జై కిషన్ మధ్య పొరపొచ్చలు వచ్చాయి.

శారదతో శంకర్ కు ఉన్న అనుబంధమే వారిద్దరూ విడిపోవడానికి కారణం అనేవారూ లేకపోలేదు. శారదా రాజన్ పాడిన సినిమా గీతాలకే కాదు ప్రైవేట్ సాంగ్స్ కూ శంకర్ తనవంతుగా సహకారం అందించారు. శారదా రాజన్ వల్లనే `ఫిల్మ్ ఫేర్` సంస్థ ఫిల్మ్ అవార్డ్స్ లో బెస్ట్ ఫీమేల్ సింగర్ కేటగిరిని ప్రారంభించింది. 1966లో `సూరజ్` సినిమా కోసం `తిత్లీ ఉడీ` గీతాన్ని శారద అద్భుతంగా పాడారు. కానీ ఆ యేడాది ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డ్ మహ్మద్ రఫీ పాడిన `బహారోం ఫూల్ బర్సావో` గీతానికి లభించింది. ప్లే బ్యాక్ సింగింగ్ లో ఒకే అవార్డు ఉండటం వల్లే శారదకు అన్యాయం జరిగిందని భావించిన ఫిల్మ్ ఫేర్ సంస్థ ఆ తర్వాత బెస్ట్ ఫిమేల్ సింగర్ కేటగిరీ ప్రవేశ పెట్టింది. అంతే కాదు 1970లో శారదా రాజన్ ఫిల్మ్ ఫేరు అవార్డ్ ను కైవశం చేసుకుంది. పలు భారతీయ భాషల్లో అద్భుతమైన పాటలు పాడిన శారదా రాజన్ అయ్యంగార్ జూన్ 14న 86 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఆమె మన మధ్య భౌతికంగా మధ్యలేకపోయినా పాడిన పాటల ద్వారా అభిమానుల గుండెల్లో చెక్కుచెదరకుండా ఉంటారు.

Show comments