Singer Sunitha: దశాబ్దాలుగా తన మధురమైన గాత్రంతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు టాలీవుడ్ సింగర్ సునీత. కేవలం 17 ఏళ్ల వయసులోనే కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె, ఇండస్ట్రీలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత.. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, కాస్టింగ్ కౌచ్, సోషల్ మీడియాలో జరుగుతున్న ‘స్త్రీ సమానత్వం’ (Feminism) చర్చలపై ఆసక్తికరమైన, సంచలన కామెంట్స్ చేశారు.
కొత్తగా వచ్చే అమ్మాయిలపై వేధింపులు నిజమే..
ఇండస్ట్రీలో మహిళలపై జరిగే వేధింపుల (Casting Couch) గురించి సునీత కుండబద్దలు కొట్టారు. “సినీ పరిశ్రమలో వేధింపులు జరుగుతున్నాయనేది అక్షరాలా నిజం. అయితే, ఇది ఇప్పటికే ఫేమ్ (గుర్తింపు) తెచ్చుకున్న వారి కంటే.. కొత్తగా అవకాశాల కోసం వచ్చే అమ్మాయిల విషయంలో చాలా ఎక్కువగా ఉంటుంది” అని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనుభవాలను కూడా సునీత ఈ సందర్భంగా పంచుకున్నారు. “నేను కూడా 18 ఏళ్ల వయసులోనే ఇలాంటి చేదు అనుభవాలను చూశాను. అయితే అవి తీవ్రమైన స్థాయిలో లేవు. కానీ నేను కచ్చితంగా ఒక మాట చెప్పగలను.. ఇండస్ట్రీ కొత్తగా వచ్చే వాళ్లకు సేఫ్ ప్లేస్ కాదు. ఇక్కడ మీరు సేఫ్ గా ఉండాలి అంటే.. మెంటల్‌గా, ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా, ఫైనాన్సియల్‌గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడే ఇండస్ట్రీలో తట్టుకుని నిలబడగలరు” అంటూ సునీత సంచలన నిజాలను బయటపెట్టారు.
ఈ రోజుల్లో బట్టల ఎంపిక, వ్యక్తిగత స్వేచ్ఛపై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనిపై సునీత తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. “చాలా మంది ‘నా బాడీ నా ఇష్టం.. నాకు నచ్చిన బట్టలు వేసుకుంటా’ అని మాట్లాడుతున్నారు. దాన్ని ఫెమినిజం, ఈక్వాలిటీతో ముడిపెడుతున్నారు. ‘నీ బాడీ నీ ఇష్టం’ అని నువ్వంటే.. ‘నా కళ్లు నా ఇష్టం.. నేను చూస్తా’ అని అవతలి వ్యక్తి అంటాడు. నీకు నచ్చిన బట్టలు నువ్వు వేసుకో, నిన్ను ఎవరూ అడ్డుకోవట్లేదు. కానీ, ఆ వ్యక్తిగత కోరికను సమాజం మీదికి రుద్దడం, దానికి ఈక్వాలిటీ అని పేరు పెట్టడం కరెక్ట్ కాదు” అని సునీత స్పష్టం చేశారు. మహిళలు సిగరెట్ తాగడాన్ని సమానత్వంగా భావించడాన్ని కూడా ఆమె తప్పుబట్టారు. “సిగరెట్ విషయంలో మగవాళ్లు, ఆడవాళ్లు అస్సలు సమానం కాదు. ఒక సిగరెట్ తాగితే మగవాడి కంటే ఆడవాళ్ల శరీరానికి జరిగే నష్టమే చాలా ఎక్కువ. ఈక్వాలిటీ పేరుతో ఇలాంటి చెత్త విషయాలను చర్చించడం నాకు నచ్చదు. మహిళలకు సమాజంలో ఇంకా చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడాలి” అని ఆమె హితవు పలికారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

