హైదరాబాద్ బంజారాహిల్స్ రాడిసన్ పబ్ ఘటనపై ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ స్పందించాడు. ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఉండటంతోనే తాను పబ్‌కు వెళ్లానని అతడు క్లారిటీ ఇచ్చాడు. అసలు తనకు డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదన్నాడు. డ్రగ్స్ తీసుకుంటే ఇప్పుడు ఇంట్లో ఎందుకు కూర్చుంటానని ప్రశ్నించాడు. అడ్డంగా దొరికిపోయారు అంటూ సోషల్ మీడియాలో తమను టార్గెట్ చేస్తూ ప్రచారం చేయడం తగదని అతడు వాపోయాడు. నిర్ణీత సమయానికి పబ్ మూయకపోతే నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి కానీ తమను ఇబ్బంది పెట్టడం సరికాదని హితవు పలికాడు.
పబ్ నుంచి బయటకు వెళ్లాలంటే 40 నిమిషాలు టైం పడుతుందని.. క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్లే పబ్ నుంచి బయటకు వెళ్లడం ఆలస్యమైందని రాహుల్ సిప్లిగంజ్ వివరణ ఇచ్చాడు. రాడిసన్ క్లబ్‌కు తాను వెళ్లడం ఇది రెండోసారి అని పేర్కొన్నాడు. డ్రగ్స్ తీసుకున్న వ్యవహారంపై తాను ఎటువంటి టెస్టులకైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వచ్చారని.. ఏదో చెకింగ్‌కు వచ్చారని తాము భావించామన్నాడు. అక్కడ డ్రగ్స్ ఉన్నాయన్న విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నాడు. మొన్నటివరకు డ్రగ్స్‌పై ఎవేర్‌నెస్ కల్పించిన వ్యక్తిని తాను అని.. అలాంటిది తాను ఎందుకు డ్రగ్స్ వాడతానని రాహుల్ సిప్లిగంజ్ వాపోయాడు.
