NTV Telugu Site icon

Mallemala : శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాయాజాలం!

పట్టుమని పది సినిమాలు కూడా నిర్మించలేదు. కానీ, నిర్మాత మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు. త్రికరణ శుద్ధితో చేసే పనులు విజయం సాధిస్తాయి అని ప్రతీతి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి తనకు నచ్చిన పనిని త్రికరణ శుద్ధితో చేసేవారు. అందువల్లే తండ్రి యమ్‌.యస్. రెడ్డి చిత్రసీమలో సాధించని విజయాలను శ్యామ్ ప్రసాద్ రెడ్డి సొంతం చేసుకున్నారు. అలా ‘తండ్రిని మించిన తనయుడు’ అనిపించుకున్నారు.

శ్యామ్ ప్రసాద్ రెడ్డి 1958 మార్చి 9న జన్మించారు. ఆయన తండ్రి మల్లెమాల సుందరరామిరెడ్డి అప్పటికే కలప వ్యాపారం చేస్తుండేవారు. ఆయన చిత్రసీమలో యమ్.యస్.రెడ్డిగా సుప్రసిద్ధులు. అంతకు ముందు కొన్ని అనువాద చిత్రాలను నిర్మించిన యమ్.యస్.రెడ్డి 1971లో శ్రీకౌముదీ పిక్చర్స్ పతాకంపై యన్టీఆర్ తో ‘శ్రీకృష్ణ విజయం’ తెరకెక్కించారు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఆ తరువాత “కోడెనాగు, రామబాణం, ముత్యాలపల్లకి, నాయుడుబావ, పల్నాటి సింహం, ఏకలవ్య, వంశోద్ధారకుడు, వెలుగునీడలు, రామాయణం” చిత్రాలు నిర్మించారు. వాటిలో కృష్ణ హీరోగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పల్నాటి సింహం’ మంచి విజయం సాధించింది. ఇక అందరూ బాలలతో గుణశేఖర్ దర్శకత్వంలో యమ్మెస్ రెడ్డి నిర్మించిన ‘రామాయణం’ కూడా ఆకట్టుకుంది. మొత్తానికి నిర్మాతగా యమ్మెస్ రెడ్డి విజయాల శాతం తక్కువనే చెప్పాలి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి విదేశాలలో విద్యనభ్యసించి, స్వదేశం వచ్చాక ఏదైనా వ్యాపారం చేసుకోవాలని భావించారు. అయితే చిన్నతనం నుంచీ సినిమా వాతావరణం చూడడం వల్ల ఆయన మనసు కూడా సినిమా రంగంవైపే పరుగు తీసింది.

ఆ సమయంలో తమ చిత్రాలకు పనిచేస్తున్న కోదండరామిరెడ్డి వద్ద దర్శకత్వంలోని మెలకువలు నేర్చుకున్నారు. అలాగే తన తండ్రి వద్ద, దర్శకనిర్మాత పి.యన్.రామచంద్రరావు వద్ద చిత్ర నిర్మాణంలోని సాధకబాధకాలు తెలుసుకున్నారు. సినిమా నిర్మాణం చేపట్టగలననే నమ్మకం కుదిరాక, తొలి ప్రయత్నంగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘తలంబ్రాలు’ నిర్మించారు. రాజశేఖర్, కళ్యాణ చక్రవర్తి, జీవిత నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తొలి ప్రయత్నంలోనే శ్యామ్ కు విజయం దక్కగానే అందరూ తండ్రికి తగ్గ తనయుడు అన్నారు. ఆ తరువాత కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే “ఆహుతి, అంకుశం” చిత్రాలతో వరుస విజయాలు చూశారు. చిత్ర నిర్మాణంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి ‘హ్యాట్రిక్’ సాధించగానే సినీజనం ‘తండ్రిని మించిన తనయుడు’ అనీ కీర్తించారు. కోడి రామకృష్ణతో వరుసగా మూడు సినిమాలు నిర్మించి, విజయం సాధించిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి అన్నిటా రాజశేఖర్ ను ప్రధాన పాత్రలో ఎంచుకున్నారు. రాజశేఖర్ హీరోగా కె.యస్.రవి దర్శకత్వంలో శ్యామ్ నిర్మించిన ‘ఆగ్రహం’ అంతగా ఆకట్టుకోలేక పోయింది.

ఇక తెలుగునాట సింగీతం శ్రీనివాసరావు ‘భైరవద్వీపం’తో గ్రాఫిక్స్ మాయాజాలానికి ఓ క్రేజ్ సంపాదించి పెట్టారు. ఆ సినిమా తరువాత మళ్ళీ తెలుగులో గ్రాఫిక్స్ తో మాయ చేసిన చిత్రం శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ‘అమ్మోరు’ అనే చెప్పాలి. ఈ సినిమా కూడా కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే రూపొందింది. ‘అమ్మోరు’ అనూహ్య విజయం సాధించింది. గ్రాఫిక్స్ తెలుగునాట రోజు రోజుకూ పెరుగుతున్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని చిరంజీవి హీరోగా ‘అంజి’ చిత్రాన్ని ఎంతో శ్రమకు ఓర్చి తెరకెక్కించారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే రూపొందిన ‘అంజి’ కోసం దాదాపు ఆరు సంవత్సరాలు శ్రమించారు శ్యామ్ ప్రసాద్. అయితే ‘అంజి’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అయినా పట్టు వదలని విక్రమార్కునిలా ‘అరుంధతి’ నిర్మించారు. ఈ చిత్రానికి కూడా కోడి దర్శకుడు. ‘అరుంధతి’ ఘనవిజయం సాధించింది. ఆ తరువాత కారణాలు ఏమో తెలియవు కానీ, శ్యామ్ ప్రసాద్ రెడ్డి చిత్ర నిర్మాణానికి దూరంగా జరిగారు. మల్లెమాల ఫిలిమ్స్ పతాకంపై ‘ఢీ, అదుర్స్, జీన్స్, క్యాష్, స్టార్ మహిళ, జబర్దస్త్” వంటి ప్రోగ్రామ్స్ తో బుల్లితెరపై భలేగా సందడి చేశారు. ఆయన వారసులుగా కూతుళ్ళు ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అఖండ విజయం సాధించి, సినిమా రంగంలో కన్నా మిన్నగా శ్యామ్ ప్రసాద్ కు లాభాలు సంపాదించి పెట్టాయి.

ఏది ఏమైనా తెలుగు చిత్రసీమలో అభిరుచి గల నిర్మాతగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి తనకంటూ ఓ ప్రత్యేకస్థానం సంపాదించారు. “పరుగు తీసే సత్తా ఉన్నప్పుడు, నడవడమెందుకు?” అంటారు శ్యామ్. అదే తన వారసులకు కూడా బోధించారు. అందువల్లే బుల్లితెరపై మల్లెమాల ఫిలిమ్స్ బ్యానర్ ఓ ప్రత్యేకతను సంతరించుకొని, ఎందరికో స్ఫూర్తి కలిగించింది. శ్యామ్ నిర్వహించిన బుల్లితెర కార్యక్రమాలను ఇన్ స్పిరేషన్ గా తీసుకొని ఎందరో తరువాతి రోజుల్లో విజయం సాధించారు.