భారతీయ చిత్రసీమలో తండ్రికి తగ్గ తనయుడు, అన్నలకు తగ్గ తమ్ముడు అనిపించుకున్న నటుడు ఎవరు అంటే శశి కపూర్ పేరు ముందుగా వినిపిస్తుంది. మూకీల నుండి టాకీల ఆరంభం దాకా తనదైన బాణీ పలికించిన మహానటుడు పృథ్వీరాజ్ కపూర్ చిన్నకొడుకు శశి కపూర్. ఆయన అన్నలు రాజ్ కపూర్, షమ్మీ కపూర్ సైతం హిందీ చిత్రసీమలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆ ఇద్దరూ రొమాంటిక్ హీరోస్ గా జయకేతనం ఎగురవేశారు. వారి బాటలోనే పయనిస్తూ శశి సైతం యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో అనిపించుకున్నారు. తనకంటే చిన్నవారికి సైతం తమ్మునిగా నటించి అలరించారు. చాక్ లెట్ బోయ్ గానూ మురిపించారు. నిర్మాత, దర్శకునిగానూ ఆకట్టుకున్నారు. బాలీవుడ్ లో శశి కపూర్ తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు.
శశి కపూర్ 1938 మార్చి 18న జన్మించారు. పృథ్వీరాజ్ కపూర్ తన తనయుల పేర్లలోనూ అందరికీ రాజ్ కపూర్ అన్నది జోడించారు. రణబీర్ రాజ్ కపూర్, షంషేర్ రాజ్ కపూర్, బల్బీర్ రాజ్ కపూర్ అంటూ తనయులకు పేర్లు పెట్టారు పృథ్వీ రాజ్ కపూర్. తరువాత వారు తమకు అనువైన పేర్లతో చిత్రసీమలో అలరించారు. బల్బీర్ శశి కపూర్ గా చిత్రసీమలో అడుగు పెట్టారు. బచ్ పన్, తడ్బీర్ చిత్రాలలో బాలనటునిగా కనిపించిన తరువాత తన అన్న రాజ్ కపూర్ దర్శకునిగా తెరకెక్కించిన తొలి చిత్రం ఆగ్లోనూ నటించారు శశికపూర్. ఆ పై రాజ్ దర్శకత్వంలోనే తెరకెక్కిన ఆవారాలో చిన్నప్పటి రాజ్ కపూర్ గా శశి అభినయించారు. ఇతరుల చిత్రాల్లోనూ బాలనటునిగా మెప్పించారు. యశ్ చోప్రా దర్శకత్వంలో బి.ఆర్.చోప్రా నిర్మించిన ధర్మపుత్రలో శశికపూర్ తొలిసారి హీరోగా నటించారు. ఆ వెంటనే మర్చంట్ ఐవరీ నిర్మించిన ద హౌస్ హోల్డర్అనే ఇంగ్లిష్ చిత్రంలో అభినయించారు. ఆ సినిమా మంచి పేరు సంపాదించి పెట్టింది. అప్పటికే ఆయన అన్నలు సూపర్ స్టార్స్ గా రాజ్యమేలుతున్నారు. దాంతో తనకంటూ ఓ ప్రత్యేకత సంతరించుకోవడానికి అన్నట్టు ఐవరీస్ నిర్మించిన ద షేక్సిపియర్ వాలా, ప్రెట్టీ పోలీ వంటి ఇంగ్లిష్ సినిమాలలో నటించి మెప్పించారు శశి. ఆమ్నే సామ్మే, హసీనా మాన్ జాయేగీ, కన్యాదాన్ చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. షర్మిలీ చిత్రం మరింత విజయం సాధించింది. ఆ గలే లగ్జా విజయంతో యూత్ లోమంచి ఫాలోయింగ్ సంపాదించారు శశి.
దీవార్, త్రిశూల్ చిత్రాలలో తనకంటే చిన్నవాడయిన అమితాబ్ కు తమ్మునిగా నటించి ఆకట్టుకున్నారు శశి కపూర్. ఫకీరా, చోర్ మచాయే షోర్, చోరీ మేరా కామ్ వంటి మాస్ మూవీస్ తోనూ మురిపించారాయన. రాజ్ కపూర్ దర్శకత్వంలో శశి కపూర్ హీరోగా నటించిన సత్యం శివం సుందరం సినిమా ఆరోజుల్లో యువతను కిర్రెక్కించింది. న్యూ ఢిల్లీ టైమ్స్ చిత్రంలో శశికపూర్ ఉత్తమ నటునిగా నేషనల్ అవార్డు అందుకున్నారు. తన అన్నలకు సాధ్యం కానిది తాను చేసి చూపించి, ప్రత్యేకతను చాటుకున్నారు శశి. జునూన్ చిత్రంతో ఉత్తమ నిర్మాతగానూ నేషనల్ అవార్డు సంపాదించడం విశేషం.
ఆంగ్ల నటి జెన్నీఫర్ ను ప్రేమించి పెళ్ళాడిన శశికపూర్ కు ముగ్గురు సంతానం.కునాల్ కపూర్, కరణ్ కపూర్, సంజనా కపూర్. భార్య జీవించి ఉన్నన్ని రోజులు శశి కపూర్ తన వయసు కన్నా చిన్నగా కనిపించేవారు. జెన్నీఫర్ చనిపోయిన తరువాత ఆయన ఆరోగ్యంపై శ్రద్ధ చూపించలేదు. భారీగా శరీరం పెంచేసి, ఆ అన్నలకు తగ్గ తమ్ముడే అనిపించారు. అమితాబ్ బచ్చన్ హీరోగా అజూబా అనే ఫాంటసీ సినిమాను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించి భారీ నష్టాలు చవిచూశారు. ఆయన సంతానం సైతం నటనలో రాణించే ప్రయత్నం చేశారు. కానీ, అంతగా అలరించలేక పోయారు. ఏది ఏమైనా భారతీయ చలన చిత్రసీమలో శశి కపూర్ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. భారత ప్రభుత్వం పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో ఆయనను గౌరవించింది. 2017 డిసెంబర్ 4న శశి కపూర్ తుదిశ్వాస విడిచారు. శశికపూర్ బాణీని జనం తమ మదిలో ఇప్పటికీ పదిలపరచుకొనే ఉన్నారు.
