దివంగత ‘రియల్ స్టార్’ శ్రీహరి, నటి శాంతి దంపతుల పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి వివాహం నిశ్చయమైంది. టాలీవుడ్లో ఎంతో పేరుగాంచిన ఈ కుటుంబంలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఇరు కుటుంబాల సమ్మతితో, ఫ్రెండ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో శశాంక్ వివాహం నిశ్చయమైనట్లు తెలుస్తోంది. ఈ శుభకార్యానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం.
ఈ వివాహ వేడుకకు సంబంధించి ముహూర్తాలు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. శశాంక్ శ్రీహరి, సంజనల నిశ్చితార్థ వేడుక వచ్చే ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సమాచారం. ఇరు కుటుంబాల బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను జరిపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. శ్రీహరి పెద్ద కుమారుడి నిశ్చితార్థ వార్త తెలియడంతో టాలీవుడ్ వర్గాలతో పాటు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

