బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కింగ్‘ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పదే పదే లీకుల భారిన పడడం ఫ్యాన్స్ ను కలవరపెడుతుంది. చిత్ర యూనిట్ ఎంత జాగ్రత్త పడుతున్నా ఈ సినిమాను లీకులు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా సౌత్ ఆఫ్రికా షెడ్యూల్ నుండి కీలక దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో మేకర్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం చిత్ర బృందం సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ తీరంలో షూటింగ్ చేస్తోంది. అక్కడ షారూఖ్ ఖాన్ మరియు దీపికా పదుకొణేలపై ఒక అందమైన మెలోడీ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సముద్రపు ఒడ్డున ఇద్దరు స్టార్స్ డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు లీక్ అవ్వడంతో చిత్ర యూనిట్ మాత్రం షాక్ అయింది. కేవలం సాంగ్ మాత్రమే కాకుండా కొన్ని హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా లీక్ అయినట్లు సమాచారం. వరుస లీకుల నేపథ్యంలో సినిమా భద్రతపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కీలకమైన సన్నివేశాలను గోప్యంగా ఉంచడంలో “టోటల్ టీమ్ ఫెయిలైంది” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేసున్నారు కింగ్ ఖాన్ ఫ్యాన్స్. దీనిపై స్పందించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ లీక్ అయిన వీడియోలను షేర్ చేయవద్దని థియేటర్లలో ప్రేక్షకులకు కలిగే థ్రిల్‌ను చెడగొట్టవద్దని అభిమానులను కోరారు. క్రిస్మస్ కానుకగా 2026 డిసెంబర్ 24న ‘కింగ్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో షారూఖ్ కూతురు సుహానా ఖాన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. యాక్షన్ మరియు ఎమోషన్ కలగలిసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి
