తమిళ చిత్రసీమలో కమెడియన్ సంతానంకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అతనికంటూ కొంతమంది అభిమానులు ఉన్నారు. దాంతో సంతానం హీరోగానూ తన అదృష్టం పరీక్షించుకునే పనిలో పడ్డాడు. అలా మూడేళ్ళ క్రితం ‘సర్వర్ సుందరం’ అనే సినిమా తెరకెక్కింది. కానీ గ్రహచారం బాగోక ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా అది ఇప్పటి వరకూ విడుదలకు నోచుకోలేదు. అయితే… గత యేడాది ఈ సినిమా దర్శకుడు ఆనంద్ బల్కీ ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడంపై అభిప్రాయం చెప్పమని నెటిజన్లను కోరాడు. ఓటీటీలో విడుదలైనా మూవీని చూస్తామంటూ చాలామంది పాజిటివ్ గా స్పందించారు.
సంతానం నటించిన ‘సర్వర్ సుందరం’ మూవీకి నగేశ్ మనవడు బిజేష్ కు ఓ అనుబంధం ఉంది. ఈ సినిమాలో అతను ఓ కీలక పాత్ర పోషించాడు. విశేషం ఏమంటే… 1964లో సీనియర్ నటుడు నగేశ్ సైతం ‘సర్వర్ సుందరం’ పేరుతో సినిమాలో నటించి, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన కెరీర్ లో ఆ సినిమా ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. ఇప్పుడు తాతగారి సినిమా పేరుతో రూపుదిద్దుకున్న సినిమాలో నటించిన బిజేష్ కూడా ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ఎదురుచూస్తున్నాడు. ఇటీవల సంతానం ఇన్ స్టాగ్రామ్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో ‘సర్వర్ సుందరం’ మూవీ ఓటీటీలో త్వరలోనే విడుదలయ్యే ఛాన్స్ ఉందని చెప్పాడు. దాంతో ఈ సినిమా విడుదలపై మళ్ళీ ఆశలు చిగురించాయి.
ఇదిలా ఉంటే… సంతానం హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీ ‘దిక్కిలోనా’ ఈ నెల 10న వినాయక చవతి కానుకగా జీ 5లో స్ట్రీమింగ్ కాబోతోంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని కార్తీక్ యోగి తెరకెక్కించాడు. సో… దీని తర్వాతే ‘సర్వర్ సుందరం’ జనం ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.