(ఆగస్టు 23న నటి అన్నపూర్ణ పుట్టినరోజు)
ప్రస్తుతం బామ్మగా, అమ్మమ్మగా నటిస్తూ నవతరం ప్రేక్షకులను అలరిస్తున్నారు అన్నపూర్ణమ్మ. నిన్నటి తరం హీరోలకు అమ్మగానూ నటించి, ‘అమ్మ’ పాత్రల్లో తనదైన బాణీ పలికించారామె. ఇప్పటికీ నవ్వులు పూయించడంలోనూ మేటినని అనిపించుకుంటున్నారు. గ్లామర్ బామ్మ అని కొందరు, అందాల అమ్మమ్మ అని మరికొందరు అన్నపూర్ణమ్మను పిలుస్తున్నారు. నిజంగా నాయికగానే తెరమీద తొలిసారి కనిపించారామె. దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘స్వర్గం-నరకం’ చిత్రంలో మోహన్ బాబుకు భార్యగా నటిస్తూ పరిచయమయ్యారు అన్నపూర్ణ. ఆ తరువాతి రోజుల్లో మోహన్ బాబుకే అనేక చిత్రాల్లో తల్లిగా నటించారు. ఆ తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ కు కూడా అమ్మగా నటించి అలరించారు.
అన్నపూర్ణమ్మ తన దరికి చేరిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ఇట్టే అలరించేవారు. యన్టీఆర్ హీరోగా రూపొందిన ‘అనురాగదేవత’లో ఆయనకు తల్లిగా నటించి మెప్పించారు అన్నపూర్ణ. ఆ తరువాత నుంచీ అన్నపూర్ణకు తల్లి వేషాలే ఎక్కువగా వచ్చాయి. అయినా వాటిలోనూ వైవిధ్యం ప్రదర్శిస్తూ సాగారామె. చాలా చిత్రాల్లో కరుణరసం కురిపించే పాత్రల్లో మెప్పించిన అన్నపూర్ణ, ‘అప్పుల అప్పారావు’ వంటి చిత్రాలలో కామెడీతోనూ కదం తొక్కారు. ఆ మధ్య వచ్చిన ‘అ ఆ’లోనూ అన్నపూర్ణమ్మ ధరించిన పాత్ర నవ్వులు పూయించింది. ‘గీత గోవిందం’లో హీరోయిన్ రశ్మిక బామ్మగా నటించీ నవతరం ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్నారు. మాతృభాష తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మళయాళ, హిందీ చిత్రాలలోనూ అన్నపూర్ణమ్మ నటించారు. ఇప్పటికీ ఉత్సాహంగా నటిస్తూనే ఉన్న అన్నపూర్ణమ్మ మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకుంటూ మరింతగా అలరిస్తారని ఆశిద్దాం.