(ఫిబ్రవరి 16తో ‘సావాసగాళ్ళు’కు 45 ఏళ్ళు)
ప్రముఖ నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ ను ఆదర్శంగా తీసుకొనే ఎంతోమంది నిర్మాతలు తమ అభిరుచిని చాటుకున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత డి.రామానాయుడు సైతం ఆ సంస్థ ను ఆదర్శంగా తీసుకున్నవారే. ఆయన నిర్మించిన తొలి చిత్రం ‘రాముడు-భీముడు’ను విజయా సంస్థ తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేసింది. అప్పటి నుంచీ రామానాయుడుతో ఆ సంస్థకు అనుబంధం ఉంది. అలా సురేశ్ సంస్థతోనూ విజయ కలసి నిర్మించిన చిత్రాలు ఉన్నాయి. విజయ అండ్ సురేశ్ కంబైన్స్ పతాకంపై రామానాయుడు నిర్మాతగా రూపొందిన ‘సావాసగాళ్ళు’ చిత్రం 1977 ఫిబ్రవరి 16న విడుదలయింది. ఈ చిత్రం ద్వారా బోయిన సుబ్బారావు దర్శకునిగా పరిచయం అయ్యారు. కృష్ణ, జయచిత్ర జంటగా నటించిన ఈ సినిమాలో గుమ్మడి, సత్యనారాయణ సావాసగాళ్ళుగా నటించారు.
‘సావాసగాళ్ళు’ కథలోకి తొంగి చూస్తే – సత్యం, ఉంగరాల సాంబయ్య మంచి స్నేహితులు., వారి అమ్మాయిలు సీత, రాణి కూడా ఒకే ఈడు వారు. కానీ, వీరిమధ్య ఉన్నంత స్నేహం వారికి ఉండదు. పైగా రాణి తన డాబు చూపిస్తూ సీతను గేలి చేస్తూ ఉంటుంది. దానికి తగిన విధంగా సీత కూడా చురకలేస్తూ ఉంటుంది. సత్యం ఇంట్లో అద్దెకు ఉండే రామును, సీత ప్రేమించి పెళ్ళాడుతుంది. రాణి, ప్రకాశ్ అనే షావుకారును వివాహమాడుతుంది. ఆ షావుకారు, రాముకు పాత మిత్రుడే. అతని వద్దే రాము తన కళతో ఉద్యోగం చేస్తుంటాడు. కానీ, హోదా మారడంతో అతనూ రాముని చులకన చేస్తాడు. రాము కష్టించి పనిచేసి, తనకు వచ్చిన శిల్పకళతో ఓ అద్భుతమైన శిల్పాన్ని చెక్కుతాడు. ఆ తరువాత రాము తీరు మారుతుంది. సత్యం అల్లుడు కూతురు వద్ద ఉంటాడు. అదే తీరున రాణి దగ్గరకు ఆస్తిపాస్తులన్నీ అమ్ముకొని వచ్చి దర్జాగా ఉండాలని ఆశిస్తాడు సాంబయ్య. కానీ, కూతురు ఇంట్లో పలు అవమానాలు ఎదురవుతాయి. దాంతో సాంబయ్య దగ్గరకు చేరతాడు. డబ్బుకు ఆశించి, రాణి మొగుడు తప్పుడు మార్గంలో నడుస్తాడు. దాంతో పోలీసులు అతణ్ని అరెస్ట్ చేయాలని వెంటపడతారు. రాణి రోడ్డున పడుతుంది. ఆమెను సీత చేరదీస్తుంది. ప్రకాశ్ ను దుండగుల నుండి రక్షించడంలో రాముకు గాయాలవుతాయి. ప్రకాశ్ పోలీసులకు లొంగిపోయి అసలు దోషులను చట్టానికి పట్టిస్తాడు. చివరకు సీత, రాము, సత్యం మంచి తనం తెలుసుకొని పశ్చాత్తాప పడతారు రాణి, ప్రకాశ్. అందరూ మళ్ళీ అన్యోన్యంగా ఉండడంతో కథ సుఖాంతమవుతుంది.
ఇందులో గిరిబాబు, ప్రభ, అల్లు రామలింగయ్య, నగేశ్, రమాప్రభ, గిరిజ, రాధాకుమారి, మమత, కల్పనారాయ్, కల్పన, రావి కొండలరావు, పి.జె.శర్మ, కెకె శర్మ, బాలకృష్ణ తదితరులు నటించారు. ఈ చిత్రానికి బాలమురుగన్ కథను సమకూర్చగా, మోదుకూరి జాన్సన్ సంభాషణలు రాశారు. అప్పలాచార్య హాస్య రచన చేశారు. జె.వి.రాఘవులు సంగీతం సమకూర్చగా, ఆత్రేయ, కొసరాజు, అప్పలాచార్య పాటలు పలికించారు. “బంగారు తల్లివి నీవమ్మా… నిను నమ్మినవారికి బాధలేవీ రానే రావమ్మా…”, “గోంగూరకి…”, “తొక్కుడు బండబ్బి ఓ లబ్బరు బండబ్బి…”, “ఆనందమానందమాయెనే… అందాల బొమ్మకు సిగ్గాయెనే…”, “కుచ్చిళ్ళు చీరాడు కోకకట్టి…”, “జాగేల నన్నేలగా…”, “ఈ లోకం ఒక నాటకరంగం…” అంటూ సాగే పాటలు అలరించాయి.
‘సావాసగాళ్ళు’ చిత్రానికి ముందు కృష్ణ నటించిన పౌరాణిక చిత్రం ‘కురుక్షేత్రం’ నిరాశ పరచింది. అయితే ఆ నిరాశను మరపించి, ‘సావాసగాళ్ళు’ సందడి చేసింది. శతదినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమైన బోయిన సుబ్బారావు సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన “చిలిపికృష్ణుడు, ఎంకి-నాయుడు బావ, తోడికోడళ్ళు, నాయుడుగారి కుటుంబం” వంటి చిత్రాలు రూపొందించారు. తెలుగులో ఆయన దాదాపు పాతికపైగా చిత్రాలు తెరకెక్కించారు. కన్నడలోనూ ఇరవైకి పైగా సినిమాలు తీశారు. అలా బోయిన సుబ్బారావుకు దర్శకునిగా ‘సావాసగాళ్ళు’ మంచి బోణీ చేసిందనే చెప్పాలి.