Saradhi:
ఐదు దశాబ్దాల పాటు వెండితెరపై నటుడిగా రాణించిన కడలి సారథి దాదాపు నాలుగు వందల చిత్రాలలో నటించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చెందిన సారథి తల్లిదండ్రులు కడలి మహాలక్ష్మీ, వీరదాసు భాగవతార్. ప్రాధమిక విద్యను పెనుగొండలో అభ్యసించిన సారథి కాలేజీ చదువు భీమవరంలో కొనసాగించారు. సారథి తండ్రి వీరదాసు భాగవతార్‌కు జాతీయ స్థాయిలో హరికథకుడిగా మంచి గుర్తింపు ఉంది. మరీ ముఖ్యంగా బొంబాయిలోని పృథ్వీరాజ్ కపూర్ థియేటర్ లోనూ ఆయన హరికథలు చెబుతుండేవారు. అలనాటి నటుడు పృథ్వీరాజ్ కపూర్ వారి హరికథలను బాగా ఆస్వాదించేవారు. వీరదాసు పలు చిత్రాలలోనూ నటించారు. 1945లో వచ్చిన ‘భీష్మ’ చిత్రంలో ఆయన శంతన మహారాజు పాత్రను పోషించారు.
చెన్న పట్టణంలోనూ నాటకాలు
తండ్రి ప్రోత్సాహంతో సారథి 18వ యేట నుండే నాటకాలు వేయడం మొదలెట్టారు. ‘శకుంతల, పరీక్ష, తెరవెనుక, అన్వేషణ’ వంటి పౌరాణిక, సాంఘిక నాటకాల్లో సారథి ప్రధాన పాత్రలను పోషించారు. వీటిలో కొన్ని నాటకాలలో హాస్య పాత్రలను చేశారు. అలానే నూకల నారాయణరావు రాసిన ‘తెర వెనుక, అన్వేషణ’ నాటకాలకు ఆయనే దర్శకత్వం వహించారు. ఓ పక్క కాలేజీ చదువు సాగుతుండగానే తిరుపతి, పాలకొల్లు, రాజమండ్రి, కాకినాడ, విశాఖ పట్నం తదితర పట్టణాలలో పరిషత్ నాటకాలు వేసి సారథి బెస్ట్ కమెడియన్ గా 17 అవార్డులను అందుకున్నారు. పెద్దక్కయ్య జగదాంబ ప్రోత్సాహంతో సినీ నటుడు కావాలనే ఆశతో ఆయన మద్రాసులో అడుగుపెట్టారు. చెన్నపట్టణం చేరిన కొత్తలో ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి సోదరుడు కొమ్మినేని శేషగిరిరావు లో కలిసి నాటక సమాజం ప్రారంభించి, అక్కడా నాటకాలు ఆడారు. 1961లో ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ నాటకంలో వాణిశ్రీ టైటిల్ రోల్ వేసిన ప్రదర్శన సారథి బృందానికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘మద్రాస్‌లో ‘తెరవెనుక’ నాటకంలో ఇరవై యేళ్ళ వయసున్న తాను డెబ్బైయేళ్ళ వృద్థుడిగా శరభయ్య పాత్రను పోషించినప్పుడు ఎస్వీ రంగారావు ఎంతో మెచ్చుకుని, రూ. 300 బహుమతిగా ఇచ్చిన విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని సారథి చెబుతుండేవారు.
‘సీతారామ కల్యాణం’తో తొలి అడుగు
సారథి తండ్రి వీరదాసు అంటే మహానటుడు ఎన్టీయార్‌కు ఎంతో అభిమానం. ఆ రకంగా వారితో ఉన్న అనుబంధంతో సారథిని ఆయన ఎన్టీయార్‌కు పరిచయం చేశారు. ఆ రకంగా తన ‘సీతారామకల్యాణం’లో ఎన్టీయార్ సారథికి ఓ వేషం ఇచ్చారు. అలా సారథి సినీ రంగ ప్రస్థానంకు శ్రీకారం జరిగింది. ఆ తర్వాత నుండి సారథికి వరుసగా వేషాలు వచ్చాయి. ‘వెలుగు నీడలు, సింహాచల క్షేత్ర మహిమ, పరమానందయ్య శిష్యుల కథ, శారద, మాయని మమత, చాణక్య చంద్రగుప్త, అమర సందేశం, మన ఊరి పాండవులు, కోడలు దిద్దిన కాపురం, భక్త కన్నప్ప, బొబ్బలి బ్రహ్మన్న, పల్లెటూరి బావ, అత్తవారిల్లు’ తదితర చిత్రాలలో సారథి ప్రాధాన్యమున్న పాత్రలు చేశారు. ఆయన నటించిన పలు చిత్రాలు వివిధ భాషల్లోకీ అనువాదమయ్యాయి. విశేషం ఏమంటే… సారథి సాంఘిక చిత్రాలే కాదు… పలు జానపద, పౌరాణిక చిత్రాలలోనూ నటించి మెప్పించారు. ముఖ్యంగా విఠలాచార్య దర్శకత్వంలో వహించిన ‘జగన్మోహిని’ చిత్రం సారథికి అప్పట్లో హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
చిత్రపురి కాలనీ ఏర్పాటులో…
ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రభాకర్ రెడ్డి సహకారంతో సారథి కొన్ని చిత్రాలకు నిర్మాణ బాధ్యతలను నిర్వర్తించారు. అలానే ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన ట్విన్ సీ క్లబ్ లోనూ సారథి క్రియాశీలక పాత్ర పోషించారు. ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఫెడరేషన్, హౌసింగ్ సొసైటీలలో సారథి పలు బాధ్యతలు నిర్వర్తించారు. సినీ కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు అప్పట్లో ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ నిర్మాణం కోసం విశేష కృషి చేశారు. ఆ ప్రారంభ దినాలలో ప్రభాకర్ రెడ్డికి సారథి సైతం చేదోడు వాదోడుగా ఉన్నారు. సారథికి భార్య అనూరాధ, కుమారులు ఉదయ్ కిరణ్, లక్ష్మీ ప్రశాంత్ ఉన్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సారథి ఆగస్ట్ 1వ తేదీ ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు.
