ప్రముఖ దర్శకుడు, స్వర్గీయ శోభన్ కుమారుడు సంతోష్ శోభన్. పెదనాన్న లక్ష్మీపతి నుండి నటనను వారసత్వంగా అందిపుచ్చుకున్న సంతోష్ పేపర్ బోయ్ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. తాజాగా యూవీ కనెక్ట్స్ సంస్థ సంతోష్ శోభన్ హీరోగా నిర్మించిన ఏక్ మినీ కథ మూవీ ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ అందుకోకపోయినా… నటుడిగా శోభన్ కు మంచి గుర్తింపే తెచ్చిపెట్టింది. విశేషం ఏమంటే… ప్రస్తుతం సంతోష్ శోభన్ మరో సినిమాలో నటిస్తున్నాడు. ఇది కూడా పెళ్ళి, దానికి సంబంధించిన సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమానే. అభిషేక్ మహర్షిని దర్శకుడిగా పరిచయం చేస్తూ పన్నీరు శివప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. రాశీసింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను శుక్రవారం విడుదల చేశారు. అయితే రొటీన్ గా హీరో స్టిల్ ను రిలీజ్ చేయకుండా ఓ కార్టూన్ బొమ్మగా ఈ పోస్టర్ ను రూపొందించారు. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తి అయ్యిందని, లాక్ డౌన్ తర్వాత మిగతా భాగం షూట్ పూర్తి చేస్తామని నిర్మాత చెబుతున్నారు. ఇందులో కృష్ణచైతన్య, రుచిత సాధినేని, కృష్ణతేజ, సుదర్శన్, అశోక్ కుమార్, ప్రభావతి, మధు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనంత్ శ్రీకర్, పాటలు కిట్టు విస్పాప్రగడ, కథ అభిషేక్ మహర్షి, అనిరుథ్ కృష్ణమూర్తి అందిస్తున్నారు.
పెళ్ళికోసం తపించే ప్రేమ్ కుమార్గా సంతోష్!
