ఉలగనాయగన్ కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి కలుసుకోవడం నిజంగా విశేషమే. వారిద్దరూ ఎప్పుడు కలుసుకున్నా అభిమానులకు సంబరమే. ఇటీవల విడుదలైన కమల్ హాసన్ `విక్రమ్` చిత్రం థియేటర్లలో బాగానే సందడి చేస్తోంది. ఈ సందర్భంగా కమల్ హాసన్ ను, చిత్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌ను తన నివాసానికి ఆహ్వానించి మరీ సత్కరించారు చిరంజీవి. సిటీలోనే ఉన్న సల్మాన్ ఖాన్‌ను కూడా చిరంజీవి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పిక్చర్స్ తోపాటు 1986లో `స్వాతిముత్యం` శతదినోత్సవం సందర్భంగా కమల్, చిరంజీవితో ఉన్న రాజ్ కపూర్ ఫోటోను కూడా విడుదల చేసి 36 సంవత్సరాల క్రితం అప్పుడు రాజ్ కపూర్, ఇప్పుడు సల్మాన్ ఖాన్ అంటూ ఓ క్యాప్షన్ పెట్టి మరీ సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. చూసిన వారిలో చాలామంది రాజ్ కపూర్ తో సల్మాన్ ఖాన్ ను పోల్చినట్టయిందని అభిప్రాయపడ్డారు. రాజ్ కపూర్ ఎక్కడా, సల్మాన్ ఖాన్ ఎక్కడా అంటూ కామెంట్స్ వినిపించాయి. పైగా ఈ 36 సంవత్సరాలలో చిత్రసీమలో చోటు చేసుకున్న పరిణామాలెన్నో.
రాజ్ కపూర్ పాల్గొన్న `స్వాతిముత్యం` వేడుక నిఖార్సయిన విజయోత్సవం. ఆ సినిమా శతదినోత్సవం పూర్తి చేసుకొని 1986 బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలచింది. అది వంద రోజుల వేడుక. ఇప్పుడు `విక్రమ్`ది పదిరోజుల సంబరం. అప్పట్లో ఓ సినిమా హిట్ టాక్ వస్తే ఖచ్చితంగా అర్ధశతదినోత్సవమో, శతదినోత్సవమో, రజతోత్సవమో చూసేది. కానీ, ఇప్పుడు థియేటర్లలో సందడి ఉన్నంత వరకే సంబరాలు చేసుకొనే పరిస్థితి. ఈ 36 ఏళ్ళలో సినిమారంగంలో ఎన్నెన్నో మార్పులు చోటు చేసుకొని ఉండవచ్చు. కానీ, చిరంజీవి, కమల్ హాసన్ మధ్య స్నేహబంధంలో ఏలాంటి మార్పూ చోటు చేసుకోలేదు అనడానికి ఈ పిక్స్ నిదర్శనం. మిత్రుడు సాధించిన విజయానికి చిరంజీవి ఆనందిస్తూ వారిని ఇంటికి పిలిచి మరీ గౌరవించడం అన్న అంశాన్ని అందరూ అభినందిస్తున్నారు. తన చుట్టూ ఉన్న వారు ఎవరు విజయం సాధించినా, అభినందించడం చిరంజీవికి ఓ అలవాటు. అందులో భాగంగానే కమల్ హాసన్ ను సత్కరించారు. ఇక సల్మాన్ ఖాన్ కూడా ఇందులో పాల్గొనడం విశేషమే. చిరంజీవి నటిస్తోన్న `గాడ్ ఫాదర్`లో సల్మాన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ పిక్ చూసిన తరువాత చాలామందిలో కమల్ హాసన్, చిరంజీవి మళ్లీ కలసి నటిస్తారా అన్న ఆలోచన కూడా కలిగింది. తొలి రోజుల్లో చిరంజీవి, కమల్ హాసన్ తో కలసి `ఇది కథ కాదు` చిత్రంలో నటించారు. అప్పటి నుంచీ వారి మధ్య స్నేహబంధం కొనసాగుతూనే ఉంది. మరి ఇద్దరు మిత్రులు ఓ సినిమాలో కలసి నటిస్తే అభిమానులకు నయనానందం కలగకుండా ఉంటుందా?
