నాగచైతన్యకు విడాకులు ఇవ్వకముందే గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’కు సైన్ చేసింది సమంత. ఆ తర్వాత కొద్దిరోజులకే నాగచైతన్య, సమంత ఇద్దరూ తమ వివాహ బంధాన్ని తెంచుకుంటున్నట్టు విడివిడిగా ప్రకటించారు. ఆ తర్వాత సమంత నటిగా కొనసాగుతుందా? లేదా? అనే ప్రశ్న చాలామందిలో ఉదయించింది. వాటికి చెక్ పెడుతూ సమంత మరో పాన్ ఇండియా మూవీ ‘యశోద’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హరి – హరీశ్ సంయుక్త దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ‘యశోద’ సినిమా విడుదల తేదీని ఈ రోజు ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను గ్రాండ్ గా ఆగస్ట్ 12న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. నిజానికి ఇందులోపెద్ద విశేషం ఏమీ లేదు. కానీ చిత్రం ఏమంటే… సరిగ్గా దానికి ఒక్క రోజు ముందే ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది.
ఈ మూవీతోనే అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే నాగార్జున పలు బాలీవుడ్ చిత్రాలలో నటించి ఉత్తరాదినా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో నాగ్ నట వారసుడైనా నాగ చైతన్య సైతం ఓ పెద్ద సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టాలని భావించాడు. అది ‘లాల్ సింగ్ చద్దా’ రూపంలో అతనికి లభించింది. ఈ సినిమాను ఆమీర్ ఖాన్ పాన్ ఇండియా మూవీగా మలిచి హిందీ, తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. సో… ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్ట్ 11న జనం ముందుకు వస్తుంటే ఆ మర్నాడే చైతు మాజీ భార్య సమంత ‘యశోద’ సినిమా విడుదలవుతుందన్న మాట. ఆ రకంగా దేశ వ్యాప్తంగా ఈ రెండు సినిమాలూ ఒక దానితో ఒకటి పోటీ పడబోతున్నాయి.
అన్న – మాజీ వదిన మధ్యలో మరిది!
మరో ఆసక్తి కరమైన విషయం ఏమంటే… ఇప్పటికే ఆగస్ట్ 12న అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ మూవీని విడుదల చేయబోతున్నట్టు ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత అనిల్ సుంకర ప్రకటించాడు. ఈ మూవీకి డైరెక్టర్ సురేందర్ రెడ్డి సైతం ఈ ప్రాజెక్ట్ కు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్న ‘ఏజెంట్’ తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ డబ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏదేమైనా ఆగస్ట్ 11, 12 తేదీలలో నాగచైతన్య, సమంత, అఖిల్ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ విడుదల కావడం అక్కినేని అభిమానులందరినీ తీవ్ర గందరగోళంలో పడేస్తోంది. మరి ఇందులో ఏదైనా సినిమా విడుదల వాయిదా పడుతుందేమో చూడాలి.
