Salman Khan: ట్రోల్స్‌కు సిక్స్‌ప్యాక్‌తో సమాధానం.. 60 ఏళ్లకూ సల్మాన్ స్టామినా ఇదే!

Salman Khan

Salman Khan

Salman Khan: వయసు పెరుగుతున్న కొద్దీ ఫిట్‌నెస్ తగ్గిపోతుందనే భావనను మరోసారి తప్పు అని నిరూపించారు బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్. ఇటీవల ఆయన లుక్ పై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్‌కు ఎలాంటి మాటలు లేకుండానే గట్టి సమాధానం ఇచ్చారు. జిమ్‌లో వర్కౌట్ అనంతరం షర్ట్‌లెస్‌గా దిగిన రెండు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తన ఫిట్‌నెస్‌తోనే అందరినీ ఆశ్చర్యపరిచారు. తెల్లవారుజామున సుమారు 3 గంటలకు ఈ ఫొటోలను పోస్ట్ చేసిన సల్మాన్, కండలు తిరిగిన శరీరం, సిక్స్‌ప్యాక్ తో అభిమానులను ఫిదా చేశారు. ఫొటోలతో పాటు ‘సల్మాన్ ఖాన్ డర్ర్ర్ర్ గయా… హ్మ్మ్… జో డర్ గయా వో మర్ గయా’ అంటూ ఆయన రాసిన క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల ఆయన ఆరోగ్యం, లుక్ పై వచ్చిన విమర్శలకు ఇదే సమాధానమని అభిమానులు భావిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ లుక్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొందరు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు వయసు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందంటూ ట్రోల్ చేశారు. అయితే లేటెస్ట్ జిమ్ ఫొటోలతో సల్మాన్ మరోసారి తన ఫిట్‌నెస్‌పై ఎలాంటి రాజీ లేదని నిరూపించారు. దీంతో అభిమానులు ‘భాయ్ ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇటీవల నీట్ పరీక్ష వివాదంపై నిరసనలు చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలుపుతూ, వారి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇళ్లకు వెళ్లాలని సూచిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అలాగే నిరాహార దీక్ష చేస్తున్న కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతూ దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు. అయితే తాజాగా వైరల్ అయిన ఫిట్‌నెస్ ఫొటోలతో సల్మాన్ మరోసారి తనపై వస్తున్న విమర్శలకు స్టైలిష్‌గా కౌంటర్ ఇచ్చినట్టే కనిపిస్తోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే, సల్మాన్ ఖాన్ ప్రస్తుతం దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుండగా, షూటింగ్ కొనసాగుతోంది. మరోవైపు 2020 గాల్వాన్ లోయ ఘటనల నేపథ్యంలో రూపొందుతున్న ‘మాతృభూమి’ చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతోంది.