Site icon NTV Telugu

Koushik babu: ‘నేనే సరోజ’ అంటున్న శాన్వి మేఘన!

Soumya

Soumya

Nene Saroja: యంగ్ హీరో కౌశిక్ బాబు, శాన్వి మేఘన జంటగా నటించిన సినిమా ‘నేనే సరోజ’. ‘ఊరఫ్ కారం చాయ్’ అనేది ఉప శీర్షిక. శ్రీమాన్ గుమ్మడవెల్లి దర్శకత్వంలో ప్రముఖ రచయిత డా. సదానంద్ శారద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుమన్, చంద్రమోహన్, ఆనంద్ చక్రపాణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సందర్బంగా సదానంద్ శారద మాట్లాడుతూ, ”ఇవాళ సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ముఖ్యంగా ఆడపిల్లల పట్ల ఇంకా చూపుతున్న వివక్షతను ఎదురిస్తూ ఎదిగిన ఈ తరం ఆడపిల్ల కథ ఇది. ఈ పాత్రలో హీరోయిన్ శాన్వి మేఘన చక్కగా నటించింది. అలాగే హీరో కౌశిక్ బాబు నేటి తరం కుర్రకారుకు అద్దం పట్టే పాత్రలో ఆకట్టుకుంటాడు. నటన, డాన్స్, ఫైట్స్ అన్ని విషయాల్లో చాలా చక్కని ప్రతిభ కనబరిచాడు. ఈ సినిమా తెలంగాణ గ్రామీణ జీవితానికి అద్దం పట్టేలా వరంగల్ కోట, ఆ పరిసర ప్రాంతాలలో షూటింగ్ చేశాం. ముఖ్యంగా ‘కారం చాయ్’ అనే పదం ఈ సినిమా ద్వారా ఈ తరం అమ్మాయిలకు అస్త్రం కానుంది” అని తెలిపారు.

దర్శకుడు శ్రీమాన్ గుమ్మడవెల్లి మాట్లాడుతూ, ”ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఆసక్తికరమైన కథ, కథనంతో ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరించాం. దీనిని ఫిబ్రవరిలో జనం ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు. ‘నేనే సరోజ’ చిత్రానికి రమేశ్ ముక్కెర సంగీతం అందించగా, పాటలను గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, డా. కె సదానంద్ రాశారు. నిర్మాత డాక్టర్ సదానంద్ శారద ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించడం విశేషం.

Exit mobile version