తాజాగా మిస్ ఇంటర్నేషనల్ ఇండియా టైటిల్ గెలుచుకున్న రూష్ సింధు ఆనందంలో మునిగి పోయారు. ఈ గౌరవం తర్వాత తొలిసారిగా కుటుంబాన్ని కలుసుకున్న ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. “ఈ విజయానికి నేను ఎంతో కృతజ్ఞురాలిని. నా కుటుంబం ఎదురుగా ఉండటం, ఈ గౌరవాన్ని వారితో పంచుకోవడం నిజంగా అద్భుతమైన అనుభూతి,” అని ఆమె తెలిపారు. అలాగే రూష్ సింధు ప్రకారం, తన విజయం కేవలం వ్యక్తిగత స్థాయిలో మాత్రమే కాకుండా దేశం మొత్తానికి గర్వకారణం. “ప్రపంచం నలుమూలల నుంచి అపారమైన మద్దతు అందుతోంది. సోషల్ మీడియా ద్వారా నాకు వచ్చే శుభాకాంక్షలు నా మనసుకు మరింత బలాన్నిస్తున్నాయి” అని ఆమె అన్నారు.
Also Read : Anuparna Roy : 82వ వెనిస్ ఫెస్టివల్‌లో అవార్డు గెలిచిన అనుపర్ణ రాయ్.. పాలస్తీనా స్టేట్మెంట్‌పై క్లారిటీ
అంతర్జాతీయ పోటీకి తన కృషి గురించి మాట్లాడుతూ.. “సవాళ్లు ఎప్పుడూ ఉంటాయి. కానీ వాటిని ఎదుర్కోవడం, అధిగమించడం కోసం నేను నా 100% శ్రమిస్తున్నాను. ప్రతీ అంశంలోనూ ప్రొఫెషనల్‌గా సిద్ధమవుతున్నాను. ర్యాంప్ వాక్ నుంచి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ వరకు ప్రతి దశలో కఠినంగా శిక్షణ తీసుకుంటున్నాను” అని వివరించారు. “ఇది మిస్ ఇంటర్నేషనల్ యొక్క 63వ ఎడిషన్ కావడం చాలా స్పెషల్. భారతదేశానికి ఈ వేదికపై ఉన్న అభిమాన మద్దతు అద్భుతంగా ఉంది. ఆ మద్దతు నన్ను మరింత నమ్మకంగా, ధైర్యంగా నిలబెడుతోంది. ఈ విజయాన్ని ఒక ఆరంభంగా మాత్రమే చూస్తున్నాను. ఇంకా ముందుకు వెళ్లి భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని గౌరవాలు తీసుకురావాలనేది నా లక్ష్యం. నా ప్రయాణం ఇప్పుడు మొదలైంది” అని ఆమె దృఢంగా చెప్పారు.
