ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ (కేకే) మృతి పట్ల యావత్ సినీ లోకం సంతాపం తెలియజేస్తే.. బెంగాలీ సింగర్ రూపాంకర్ బాగ్చీ మాత్రం ‘ఎవరీ కేకే’ అంటూ అక్కడ వెళ్లగక్కాడు. ప్రాంతీయ సింగర్‌లను ప్రోత్సాహించాలంటూ.. ఓ వీడియో రిలీజ్ చేశాడు. దీంతో, అతనికి సర్వత్రా వ్యతిరేకత ఎదురైంది. నెట్టింట్లో నెటిజన్లు దుమ్మెత్తిపోశాడు. దీంతో తన తప్పు తెలుసుకున్న రూపాంకర్.. తాజాగా క్షమాపణలు తెలిపాడు. ఈ విషయంపై ప్రెస్‌మీట్ నిర్వహించి, బహిరంగంగా సారీ చెప్పాడు. తాను పోస్ట్ చేసిన వీడియోను సైతం డిలీట్ చేసినట్లు అతడు పేర్కొన్నాడు.
‘‘నాకు, కేకేకి ఎలాంటి శతృత్వమూ లేదు. బెంగాలీ పరిశ్రమకు చెందిన గాయలకు ఎలాంటి మర్యాదలు దక్కడం లేదు. కేవలం దక్షిణ, పశ్చిమ భారతదేశానికి చెందిన సింగర్స్‌కే ఎక్కువ ప్రేమ, గుర్తింపు లభిస్తోంది. ఈ విషయాన్ని మాత్రమే నేను చెప్పాలనుకున్నా. కానీ, ఇంత విద్వేశానికి గురవుతారని నేను అస్సలు ఊహించలేదు. నా భార్యకు కూడా బెదిరింపు మెస్సేజ్‌లు వస్తున్నాయి. అందుకే.. కేకే కుటుంబ సభ్యులకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ వీడియోను కూడా డిలీట్ చేశాను. కేకే ఇప్పుడు ఎక్కడున్న.. దేవుడు ఆయన ఆత్మకు శాంతి ప్రసాదించాలని కోరుకుంటున్నా’’ అంటూ రూపాంకర్ చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్లు చల్లబడ్డారు.
కాగా.. వివిధ భాషల్లో కలుపుకుని సుమారు 800కు పైనే పాటలు పాడిన కేకే, మే 31వ తేదీన కోల్‌కాతా ప్రదర్శనలో కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు స్పష్టం చేశారు. సంగీతంలో ఎలాంటి శిక్షణ తీసుకోని కేకే.. అనేక భాషల్లో పాటలు పాడి అందరి మనసులను గెలుచుకున్నారు.
