రాజమౌళి డైరెక్షన్ లో జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్.ఆర్.ఆర్.’ సినిమా పోస్టర్స్ సందడి చేస్తున్నాయి. ఆ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్నైనా జనం ఆసక్తిగా ఆలకిస్తున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్.’ పోస్టర్స్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తే, రామ్ చరణ్ కు ఇచ్చిన ప్రాధాన్యత జూనియర్ యన్టీఆర్ కు ఇవ్వలేదనే టాక్ వినిపిస్తోంది. ముందుగా టైటిల్ నే పరిశీలిస్తే అందులో మూడు ‘R’ అనే ఆంగ్ల అక్షరాలు కనిపిస్తాయి. మొదటి ‘ఆర్’లోనే రామ్ చరణ్ ను చూపిస్తూ, చివరి ‘ఆర్’లో తారక్ ను చూపించారు. ఇక ఈ మధ్య వచ్చిన కొన్ని పోస్టర్స్ లోనూ తారక్ కంటే చరణ్ కు ప్రాధాన్యమిచ్చినట్టు అభిమానులు ఇట్టే కనిపెట్టేశారు.
‘ట్రిపుల్ ఆర్’ టైటిల్ విషయమే కాదు, ఈ సినిమా ఫస్ట్ టీజర్ రామ్ చరణ్ బర్త్ డే కు ఏ స్థాయిలో విడుదలయిందో, తరువాత జూనియర్ బర్త్ డే నాటికి ప్యాండమిక్ ను అడ్డం పెట్టుకొని ఏ తీరున మెల్లగా రిలీజ్ చేశారో కూడా అభిమానులు మరచిపోలేకున్నారు.
అదలా ఉంచితే, ఈ వ్యవహారం దాదాపు 42 ఏళ్ళ క్రితం మహానటులు యన్టీఆర్, ఏయన్నార్ కలసి నటించిన ‘రామకృష్ణులు’ను గుర్తు చేస్తోందని అభిమానులు చెబుతున్నారు. నిజానికి యన్టీఆర్, ఏయన్నార్ లా 15 సినిమాల్లో కలసి నటించిన సమస్థాయి నటులు ఎవరూ లేరు. అయితే 1963లో ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ తరువాత వారిద్దరూ కలసి నటించలేదు. దాదాపు 14 ఏళ్ళ తరువాత యన్టీఆర్, ఏయన్నార్ కలసి ‘చాణక్య-చంద్రగుప్త’ చిత్రంలో నటించారు. ఆ చారిత్రక చిత్రంలో యన్టీఆర్ చంద్రగుప్తునిగా నటిస్తే, ఏయన్నార్ చాణక్య పాత్రలో కనిపించారు. ఆ సినిమా యన్టీఆర్ సొంత చిత్రం, పైగా ఆయనే దర్శకుడు. కాబట్టి, పబ్లిసిటీలో టైటిల్ లోనే ‘చాణక్య’ పదాన్ని ముందుగా చేర్చారు. అంతేకాదు, ఏయన్నార్ కు ప్రచార చిత్రాల్లో ప్రాధాన్యత కల్పించారు.
‘చాణక్య-చంద్రగుప్త’లో ఏయన్నార్ ఫ్రీగా నటించారు. అందువల్ల యన్టీఆర్ ను తమ అన్నపూర్ణ సినీ స్టూడియోస్ చిత్రంలో నటించమని కోరారు ఏయన్నార్. అందుకు యన్టీఆర్ వెంటనే అంగీకరించారు. ఆ కారణంగానే యన్టీఆర్, ఏయన్నార్ తో కలసి ‘రామకృష్ణులు’ చిత్రంలో నటించారు. ఆ చిత్రం అన్నపూర్ణ సినీస్టూడియోస్ సమర్పణలో జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమైంది. వసూళ్ళ వర్షం కురిపించింది. కానీ, జనాన్ని అంతగా అలరించలేకపోయింది. ఈ చిత్రానికి ఏయన్నార్ వీరాభిమాని అయిన వి.బి.రాజేంద్రప్రసాద్ దర్శకనిర్మాతగా వ్యవహరించారు. అందువల్ల పబ్లిసిటీలో యన్టీఆర్ కంటే ఏయన్నార్ కు ప్రాధాన్యమిచ్చినట్టుగానే పోస్టర్స్ వచ్చాయి. యన్టీఆర్ కంటే ఎత్తులో ఏయన్నార్ బొమ్మ వేయడం చేశారు. అది నందమూరి అభిమానులకు ఆవేదన కలిగించింది. దాంతో అదే పనిగా ఆ చిత్రానికి ఫ్లాప్ టాక్ నడిపారు. ఇది తెలుసుకున్న నిర్మాత తరువాత యన్టీఆర్ కు కూడా సమప్రాధాన్యమిస్తూ పోస్టర్స్ వేయించారు.
ఇప్పుడు ‘ట్రిపుల్ ఆర్’ పరిస్థితి చూస్తే జూనియర్ యన్టీఆర్ కు కూడా సీనియర్ కు జరిగిన అన్యాయమే జరిగిందని అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే ‘ట్రిపుల్ ఆర్’ నిర్మాత డి.వి.వి.దానయ్య, మెగాస్టార్ కాంపౌండ్ కు సన్నిహితుడు. ఇక జూనియర్ యన్టీఆర్ అంటే తనకు ప్రాణమని చెప్పుకొనేవారు ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి. అయినా, పబ్లిసిటీలో వ్యత్యాసం కనిపించడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. తరువాతైనా ధోరణి మారుతుందేమో చూడాలి.