ప్రస్తుతం యూత్ లో సాలిడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో ఎవరు అంటే అందరి నుంచి వినిపించే ఒకేఒక్క పేరు ‘విజయ్ దేవరకొండ’. రౌడీ హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఒక స్పోర్ట్స్ టీమ్ కి కో-ఓనర్ అయ్యాడు. ఇండియాలోనే టాప్ వాలీబాల్ టీస్ లో ఒకటైన ‘హైదరాబాద్ బ్లాక్ హాక్స్’కి కో ఓనర్ గా మారాడు విజయ్ దేవరకొండ. తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్క వాలీబాల్ టీమ్ ‘హైదరాబాద్ బ్లాక్ హాక్స్’. బ్లాక్‌హాక్స్ ఓనర్ అభిషేక్ రెడ్డి కనకాల మాట్లాడుతూ ‘‘విజయ్ మాతో చేరడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఆయన బ్రాండ్ అంబాసిడర్ మరియు సహ యజమానిగా వ్యవహరించనున్నారు. ఆయన తనతో పాటుగా టీమ్‌కు నూతన విధానం తీసుకురావడం వల్ల మా బ్రాండ్‌ను మరో దశకు తీసుకువెళ్లగలము. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల సంస్కృతి, స్ఫూర్తికి ప్రాతినిధ్యం వహించాలనే మా లక్ష్య సాధన దిశగా అతి పెద్ద ముందడుగనూ వేశాము. రాబోయే వాటి గురించి మేము చాలా సంతోషంగా ఉన్నాము’’ అని అన్నాడు.
దేవరకొండ కూడా ఈ అసోసియేషన్ గురించి మాట్లాడుతూ ‘‘బ్లాక్ హాక్స్ మరో స్పోర్ట్స్ టీమ్ అని కాకుండా అంతకు మించినది. తెలుగు వారసత్వం సగర్వంగా ప్రదర్శించాలనుకునే మా అందరికీ ఇది గర్వ కారణం. తెలుగు ప్రజలకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. అంతేకాదు, మన స్ఫూర్తి మరియు శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. మా బ్రాండ్ మరియు టీమ్‌ను భారతదేశం మాత్రమే కాదు, ఇతర ప్రాంతాలకు సైతం తీసుకువెళ్లేందుకు చేయాల్సినంతగా నేను చేస్తాను’’ అని అన్నాడు. మరి విజయ్ దేవరకొండ కో ఓనర్ మరియు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఈ టీం ఎలాంటి సెన్సేషనల్ విక్టరీస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
