‘కాంతారా చాప్టర్ 1’తో సూపర్ సక్సెస్ అందుకున్న రిషబ్ శెట్టి ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే తాజాగా ఆయన తమిళనాడులో జరిగిన విషాద ఘటనపై స్పందించారు. ఇటీవల కరూర్‌లో నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన రిషబ్ శెట్టి, ఇది ఒక్కరి తప్పు కాదని, “సమష్టి తప్పిదం” అని పేర్కొన్నారు.
Also Read : Kanthara : దయచేసి ఇలా మాత్రం కాంతార థియేటర్లకి రాకండి – రిషబ్ శెట్టి విజ్ఞప్తి
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషబ్ మాట్లాడుతూ.. “మన దేశంలో హీరో అభిమానులు తమ అభిమాన నటుడిని దేవుడిలా చూసుకుంటారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో సమయోచిత జాగ్రత్తలు తీసుకోకపోతే విషాదాలు జరుగుతాయి. ఇది ఒక వ్యక్తి చేసిన తప్పు కాదు, పెద్ద ఎత్తున జరిగే సమావేశాలను నియంత్రించడం కష్టం. మనం పోలీసులను లేదా ప్రభుత్వాన్ని సులభంగా నిందించవచ్చు. వారికి బాధ్యత ఉంది. కానీ కొన్నిసార్లు వారు గుంపును నియంత్రించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు నిజంగా దురదృష్టకరం” అని అన్నారు.
ఇక ఈ ఘటనలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. వేదికకు 10,000 మంది మాత్రమే అనుమతించాల్సి ఉండగా దాదాపు 30,000 మంది చేరుకోవడం వల్ల తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు విజయ్ ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ప్రకటించగా, గాయపడిన వారికి రూ.2 లక్షలు అందజేశారు.
