లక్షలాది మంది అభిమానులను, సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేస్తూ లెజెండరీ గేయ రచయిత పద్మశ్రీ చెంబోలు సీతారామశాస్త్రి 66 ఏళ్ళ వయసులో ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో మంగళవారం (నవంబర్ 30) సాయంత్రం 4:07 గంటలకు తుది శ్వాస విడిచారు. నవంబరు 24న న్యుమోనియా కారణంగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
సిరివెన్నెల భౌతికకాయాన్ని అభిమానులు, సినీ పరిశ్రమ శ్రేయోభిలాషుల కోసం ఈరోజు ఉదయం 7 గంటలకు ఫిల్మ్ నగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌కు తీసుకెళ్లనున్నారు. సిరివెన్నెల అంత్యక్రియలను ఆయన కుటుంబ సభ్యులు ఉదయం జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో నిర్వహించనున్నారు. దిగ్గజ గీత రచయిత అనూహ్య మృతిపై సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆయన మృతిపై ఇన్స్పిరేషనల్ పోస్ట్ చేశారు.
Read Also : సిరివెన్నెల అంత్యక్రియలు అక్కడే..
“సీతారామశాస్త్రీ గారితో నా ఫస్ట్ మెమొరీ… అన్నపూర్ణ స్టూడియోలో ఓ చెట్టుకింద కూర్చుని ఒక సిట్యుయేషన్ చెప్పి కాలేజ్ సాంగ్ లో కవిత్వం ఉండొద్దు అండి. మాములు స్టూడెంట్స్ మాట్లాడే మాటలు.. మాటలో నుంచి పాట వచ్చినట్టుగా ఉండాలి అని చెప్పగా… రెండు మూడు సెకండ్లలోనే ‘బాటనీ పాఠముంది’ సాంగ్ రాశారు. ఇలా తలచుకుంటూ పోతే ఆయనతో ఎన్నెన్నో మెమొరీలు. ఇప్పుడు జరిగిన ఘటన ప్రతి ఒక్కరికీ షాకింగ్… కానీ నాకు తెలిసి ఓ ఫిలాసఫర్ చెప్పిన దాని ప్రకారం… అందరూ జీవిస్తారు. కానీ కొంతమంది మాత్రం ముందుముందు తరాలకు ఒక మార్గదర్శిగా, ఇన్స్పిరేషన్ గా మిగిలిపోతారు. ఒకవైపు నుంచి ఆయన పోయినందుకు ఇంతా బాధగా ఉన్నా… ఆయన లైఫ్ టైంలో చేసినవన్నీ తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత వరకూ ఆయనను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. ఆయన పాటలను తలచుకుంటారు. ఆయన భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన సినిమాల్లో ఆయన చేసిన కృషి కారణంగా ఎప్పటికీ మన మధ్య బ్రతికే ఉంటారనే విషయం మాత్రం నాకు ఆనందం కలిగిస్తోంది” అంటూ సిరివెన్నెల అభిమానులకు ధైర్యం కలిగించేలా తన పోస్ట్ లో చెప్పుకొచ్చారు ఆర్జీవీ.
