Site icon NTV Telugu

RGV : ‘ద కశ్మీర్ ఫైల్స్’ ఓ న్యూ బెంచ్ మార్క్

RGV

Famous Director Ram Gopal Varma About The Kashmir Files Movie.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరిలోనూ చర్చనీయాంశమైన చిత్రం ‘ద కశ్మీర్ ఫైల్స్’. చిన్నచిత్రంగా విడుదలై భారీ విజయం దిశగా ఈ సినిమా పయనిస్తోంది. ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన బాణీలో ట్వీట్ చేశారు. ఇకపై బాలీవుడ్ ను రెండు శకాలుగా విభజించాలని అన్నారు. ఒకటి ‘ద కశ్మీర్ ఫైల్స్’కు ముందు, రెండవది ‘ద కశ్మీర్ ఫైల్స్’ తరువాత అని ఆయన ట్వీట్ చేశారు. చలనచిత్రసీమలో ఇదో కొత్త బాణీ అని, దీనిని ప్రస్తుత, భవిష్యత్ దర్శకులు దృష్టిలో ఉంచుకోవాలనీ ఆయన సూచించారు.

భారతదేశానికి తల వంటిది కశ్మీర్. దేశవిభజన జరిగిన వెంటనే పాకిస్థాన్ కశ్మీర్ లో కొంత భూభాగాన్ని ఆక్రమించింది. దానినే ‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ అనేవారు. తరువాతి రోజుల్లో అక్కడి కశ్మీర్ పండిట్స్ ను పాక్ ఉగ్రవాదులు ఊచకోత కోశారు. దాంతో కశ్మీర్ నుండి పండితులు, వారి కుటుంబాలు నిష్క్రమించాయి. ఆ సమయంలో జరిగిన దారుణ మారణకాండ నేపథ్యంలో తెరకెక్కిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ ప్రస్తుతం యావద్భారతాన్నీ ఆకర్షిస్తోంది. కొన్ని రాష్ట్రాలు ఈ చిత్రానికి వినోదపు పన్నును సైతం మినహాయించాయి. కేంద్రప్రభుత్వం మద్దతు కూడా ఈ సినిమా నిర్మాతలకు దక్కింది. దాంతో అధికార పార్టీ అభిమానులు ‘ద కశ్మీర్ ఫైల్స్’కు విశేషమైన ప్రచారం చేస్తున్నారు. ఇంతలా అలరిస్తున్న ఓ చిన్న చిత్రం ప్రతి రాష్ట్రంలోనూ విజయదుందుభి మోగిస్తోంది. ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ ‘ద కశ్మీర్ ఫైల్స్’పై తనదైన రీతిలో కామెంట్ చేయడం గమనార్హం! మరి మునుముందు ఈ సినిమా ఇంకా ఎంతగా జనాన్ని అలరిస్తుందో చూడాలి.

Exit mobile version