(అక్టోబర్ 28న సూర్యకాంతం జయంతి)
తెరపై సూర్యకాంతం కనిపించగానే జనం జడుసుకొనేవారు. ‘గయ్యాళి’ పాత్రల్లో తరచూ కనిపించడం వల్ల ‘గయ్యాళి’ అన్నది సూర్యకాంతంకు పర్యాయపదంగా నిలచింది. ఆ రోజుల్లో తెలుగునాట ‘సూర్యకాంతి’పై అభిమానం ఉన్నవారు సైతం తమ ఆడ పిల్లలకు ‘సూర్యకాంతం’ అన్న పేరు పెట్టడానికి జంకేవారు అంటే, ఆమె అభినయం ఏ స్థాయిలో జనాన్ని జడిపించిందో అర్థం చేసుకోవచ్చు. తెరపై గయ్యాళిగా కనిపించినా, నిజజీవితంలో ఆమె మనసు వెన్నపూస అనేవారు సన్నిహితులు. సూర్యకాంతం అభినయంతో ప్రేక్షకులను అలరించిన చిత్రాలెన్నెన్నో ఉన్నాయి.
సూర్యకాంతం 1924 అక్టోబర్ 28న సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయ పురం ఆమె స్వస్థలం. ఆరేళ్ళ ప్రాయంలోనే నాట్యం, సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. హిందీ పాటలు వింటూ చక్కగా నృత్యం చేసేవారు సూర్యకాంతం. అది చూసి సమీపబంధువులు కొన్ని ప్రదర్శనలు ఇప్పించారు. కొన్ని నాటకాల్లోనూ నర్తించారు. ఆ పై మదరాసు చేరి జెమినీ స్టూడియోస్ లో స్టాఫ్ ఆర్టిస్ట్ గా చేరారు. జెమినీ సంస్థ నిర్మించిన ‘చంద్రలేఖ’లో తొలిసారి తెరపై కనిపించారు. కొన్ని చిత్రాలలో నటించిన తరువాత ఎల్వీ ప్రసాద్ తెరకెక్కించిన ‘సంసారం’ చిత్రంలో శేషమ్మ పాత్రలో సూర్యకాంతం నటన ఆకట్టుకుంది. “పెళ్ళి చేసి చూడు, అమ్మలక్కలు, చక్రపాణి, ప్రేమ, దొంగరాముడు, కన్యాశుల్కం, చరణదాసి, ఇలవేల్పు, పెంకిపెళ్ళాం, మాయాబజార్, తోడికోడళ్ళు, అప్పుచేసి పప్పుకూడు, మంచి మనసుకు మంచిరోజులు, మాంగల్యబలం, వెలుగునీడలు, ఇద్దరు మిత్రులు, కలసివుంటే కలదు సుఖం, గుండమ్మ కథ, రాముడు-భీముడు” వంటి చిత్రాలలో సూర్యకాంతం పలు విలక్షణమైన పాత్రల్లో అలరించారు. వాటిలో అధికభాగం గయ్యాళి పాత్రలే కావడం విశేషం. తరచూ ఒకే తరహా పాత్రల్లో నటించినా, ఏ నాడూ జనానికి మొహం మొత్తకుండా నటించి మేటి నటిగా నిలిచారు సూర్యకాంతం.
తరువాతి రోజుల్లోనూ సూర్యకాంతం నటించిన “భీష్మ, లవకుశ, మూగమనసులు, పరువు-ప్రతిష్ఠ, బుద్ధిమంతుడు, శ్రీమంతుడు, దసరా బుల్లోడు, అత్తలు-కోడళ్ళు, ఇల్లు-ఇల్లాలు, కాలం మారింది, గంగ-మంగ” చిత్రాల్లోనూ గయ్యాళిగానే అలరించారు. కొన్ని చిత్రాల్లో గయ్యాళి అత్తగా కోడళ్ళను ఆరడిపెట్టడంతో అమ్మాయిలు ఆ పేరు వింటేనే భయపడేవారు. తన దరికి చేరిన పాత్రలకు తగిన న్యాయం చేయడానికి ఆమె తపించేవారు. ఇక తెరపై అందరినీ భయపెట్టే పాత్రల్లో నటించిన సూర్యకాంతం, తన చుట్టూ ఉన్నవారిని ఎంతో బాగా చూసుకొనేవారు. ఇంటి నుండి ప్రత్యేకంగా వంటలు చేసి తీసుకు వచ్చి సహనటీనటులకు పెట్టి ఆనందించేవారు. ఇక ఎవరైనా కొత్త దంపతులు ఉంటే, వారిని అదే పనిగా ఇంటికి పిలిచి, విందు ఏర్పాటు చేసి కొత్తబట్టలతో సత్కరించేవారు. ఇలా తెరపై గయ్యాళిగా నటిస్తూ, తెరవెనుక ఆప్యాయతలు పంచుతూ సూర్యకాంతం కడదాకా సాగారు. తరువాతి రోజుల్లో “యమగోల, బుచ్చిబాబు, గుండమ్మగారి కృష్ణులు, గయ్యాళి గంగమ్మ, ప్రేమ మందిరం, పెళ్ళీడు పిల్లలు, పెళ్ళిచూపులు” వంటి చిత్రాలలోనూ అభినయించి ఆకట్టుకున్నారు. ఆమె చివరగా కనిపించిన చిత్రం చిరంజీవి హీరోగా రూపొందిన ‘ఎస్పీ పరశురామ్’.
ఏది ఏమైనా సూర్యకాంతం అభినయం భయపెట్టినా, ఆమె నటనను ఎంతగానో తెలుగువారు అభిమానించారు. అందుకే ఈ నాటికీ ‘గుండమ్మ’గానూ, ‘గయ్యాళి గంగమ్మ’గానూ జనం మదిలో నిలచిపోయారామె.