NTV Telugu Site icon

యన్టీఆర్ ఆస్థాన సంగీత దర్శకులు టి.వి.రాజు!

TV-Raju

(ఫిబ్రవరి 20న టి.వి.రాజు వర్ధంతి)
టి.వి.రాజు – ఈ పేరు ఆ నాటి సంగీతాభిమానులకు మరపురాని మధురం పంచింది. టి.వి.రాజు ఉత్తరాది బాణీలను అనుకరిస్తారని పేరున్నా, వాటిలోనూ తనదైన బాణీ పలికిస్తూ తెలుగువారికి ఆనందం పంచారాయన. టి.వి.రాజు పేరు వినగానే మనకు మహానటుడు యన్.టి.రామారావు చప్పున గుర్తుకు వస్తారు. ఎందుకంటే రాజు స్వరకల్పనలో సింహభాగం యన్టీఆర్ చిత్రాలే కావడం కారణం.

టి.వి.రాజు పూర్తి పేరు తోటకూర వెంకటరాజు. 1921 అక్టోబర్ 25న రాజమహేంద్రవరం సమీపంలోని రఘుదేవపురంలో టి.వి.రాజు జన్మించారు. ఆయన కన్నవారిలోనూ కళారాధన ఉండేది. అలా రాజుకు కూడా చిన్నతనంలోనే సంగీతం పట్ల ఆసక్తి కలిగింది. రాజమహేంద్రవరంలోనే సంగీత సాధన చేసిన టి.వి.రాజు, చిత్రసీమలో రాణించాలని మదరాసు చేరారు. నాటి మేటి సంగీత దర్శకుల చిత్రాలకు అసిస్టెంట్ గా పనిచేశారు. కానీ, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా రాజు ప్రయాణం సాగింది. ఆ సమయంలోనే యన్టీఆర్, ఏయన్నార్ తో ‘పల్లెటూరి పిల్ల’ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్ర కథానాయిక అంజలీదేవి భర్త ఆదినారాయణ రావు ఆ సినిమాకు స్వరకల్పన చేశారు. ఆయన వద్ద అసోసియేట్ గా పనిచేశారు రాజు. అప్పట్లో యన్టీఆర్ ఓ గదిలో ఉండేవారు. అందులోనే చిత్రసీమలో రాణించాలని కలలు కంటున్న దర్శకుడు తాతినేని ప్రకాశరావు, సినిమాటోగ్రాఫర్ ఎమ్.ఏ.రహమాన్, టి.వి.రాజు కూడా తలదాచుకొనేవారు. ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటూ ఉండేవారు. యన్టీఆర్ స్టార్ హీరో అయ్యాక తన మిత్రులకు కూడా అవకాశాలు కల్పించేందుకు కృషి చేశారు. ‘పల్లెటూరి పిల్ల’ దర్శకనిర్మాత బి.ఏ.సుబ్బారావు రూపొందించిన ‘టింగురంగా’ చిత్రంతో టి.వి.రాజు సంగీత దర్శకుడయ్యారు. యన్టీఆర్ తమ యన్.ఏ.టి. పతాకంపై నిర్మించిన తొలి చిత్రం ‘పిచ్చి పుల్లయ్య’కు కూడా టి.వి.రాజు సంగీతం సమకూర్చారు. ఆ పై వరుసగా యన్.ఏ.టి. సినిమాలు “తోడు దొంగలు, జయసింహ”కు కూడా స్వరకల్పన చేశారు రాజు. వీటిలో ‘జయసింహ’ ఘనవిజయం సాధించింది. అప్పటి నుంచీ టి.వి.రాజు వెను తిరిగి చూసుకోలేదు. అయితే తాను విజయం సాధించినా, తన గురువు ఆదినారాయణరావు నిర్మించి, సంగీతం సమకూర్చిన ‘సువర్ణసుందరి’కి అసోసియేట్ గా పనిచేశారు టి.వి.రాజు.

టి.వి.రాజు తన కెరీర్ లో తెలుగు, కన్నడ, తమిళం కలిపి రమారమి 60 చిత్రాలకు సంగీతం సమకూర్చారు. వాటిలో 38 చిత్రాలు యన్టీఆర్ హీరోగా రూపొందిన సినిమాలే కావడం విశేషం! కేవలం 20 ఇతర చిత్రాలకు రాజు స్వరాలు సమకూర్చారు. యన్.ఏ.టి. సంస్థ నిర్మించిన చిత్రాలలో టి.వి.రాజు ఉండగా, ఇతరులు సంగీతం సమకూర్చిన చిత్రం ఒకే ఒక్క ‘గులేబకావళి కథ’. బయటి చిత్రాల కంటే తన మిత్రుడు యన్టీఆర్ సినిమాలకు సంగీతం సమకూర్చడమే మేలని భావించారు టి.వి.రాజు. అందుకు తగ్గట్టుగానే యన్టీఆర్ సైతం తాను నిర్మించే చిత్రాలకు, తనతో రెగ్యులర్ గా సినిమాలు తీసేవారికి టి.వి.రాజునే సంగీత దర్శకునిగా సిఫారసు చేసేవారు. రామారావుకు రాజు సంగీతం సమకూర్చిన చిత్రాలలో ఏవో ఐదారు చిత్రాలు మినహాయిస్తే అన్నీ సంగీత పరంగా అలరించినవే కావడం విశేషం!

యన్టీఆర్ నటించిన “పిచ్చి పుల్లయ్య, తోడుదొంగలు, జయసింహ, పాండురంగ మహాత్మ్యం, రాజనందిని, రేచుక్క-పగటి చుక్క, ఇంద్రజిత్ (సతీసులోచన), టాక్సీ రాముడు, సవతి కొడుకు, మంగమ్మ శపథం, విశాల హృదయాలు, శ్రీక్రిష్ణ పాండవీయం, పిడుగురాముడు, ఉమ్మడి కుటుంబం, శ్రీకృష్ణావతారం, భామావిజయం, నిండుమనసులు, చిక్కడు-దొరకడు, కలిసొచ్చిన అదృష్టం, తిక్కశంకరయ్య, నేనే మొనగాణ్ణి, బాగ్దాద్ గజదొంగ, విచిత్ర కుటుంబం, భలే తమ్ముడు, వరకట్నం, గండికోట రహస్యం, కథానాయకుడు, కదలడు-వదలడు, నిండు హృదయాలు, భలే మాస్టర్, తల్లా పెళ్ళామా, కోడలు దిద్దిన కాపురం, మారిన మనిషి, చిన్ననాటి స్నేహితులు, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, ధనమా-దైవమా” చిత్రాలకు టి.వి.రాజు స్వరాలు సమకూర్చారు. ఇక యన్టీఆర్ “చింతామణి, శ్రీ గౌరీమహాత్మ్యం” చిత్రాలకు ఇతర సంగీత దర్శకులతోనూ కలసి పనిచేశారు రాజు. రామారావు హీరోగా రూపొందిన ‘మనుషుల్లో దేవుడు’ చిత్రానికి రాజు చివరి సారిగా “అహో… హిమవన్నగమూ…” పాటకు బాణీలు కట్టారు. తరువాత ఆ చిత్రానికి మొత్తం సంగీతం సాలూరు హనుమంతరావు సమకూర్చారు.

రామారావు చిత్రాలలో టి.వి.రాజు పలికించిన పాటల్లో “ఈ నాటి ఈ హాయి… కల కాదోయి నిజమోయి… (జయసింహ), జయకృష్ణా ముకుందా మురారి… (పాండురంగ మహాత్మ్యం), అవునా… కాదా… (రేచుక్క-పగటిచుక్క), కనులీవేళ చిలిపిగ నవ్వెను… (మంగమ్మశపథం), స్వాగతం సుస్వాగతం… (శ్రీక్రిష్ణ పాండవీయం), రా రా … కౌగిలి చేర (పిడుగు రాముడు), చెప్పాలని ఉంది… (ఉమ్మడి కుటుంబం), నీ చరణ కమలాల…(శ్రీకృష్ణావతారం), దోరనిమ్మ పండులాగా…(చిక్కడు-దొరకడు), ఇదేనా మన సంప్రదాయమిదేనా… (వరకట్నం), మరదలు పిల్లా ఉలికి పడకు… (గండికోట రహస్యం), నేడే ఈ నాడే కరుణించె… (భలే తమ్ముడు), వినవయ్యా రామయ్యా… (కథానాయకుడు), ఒకటీ రెండూ మూడు…(నిండు హృదయాలు), పచ్చా పచ్చాని చిలకా…(కలిసొచ్చిన అదృష్టం), తెలుగు జాతి మనది…నిండుగ వెలుగు జాతి మనది… (తల్లా పెళ్ళామా), నీ ధర్మం నీ సంఘం నీ దేశమును మరవొద్దు… (కోడలు దిద్దిన కాపురం)” వంటివి తెలుగువారిని నేటికీ పులకింప చేస్తూనే ఉన్నాయి.

కడదాకా తనదైన పంథాలో పదనిసలు పలికిస్తూ సాగిన టి.వి.రాజు రీమేక్ మూవీస్ లో ఒరిజినల్ ట్యూన్స్ ను అనుసరించినా, తనదైన ముద్రనూ ప్రదర్శించేవారు. ఆయన తనయుల్లో పెద్దవారు వెంకట సత్యసూర్యనారాయణ రాజు గిటారిస్ట్ గా పలు చిత్రాలకు పనిచేశారు. మరో తనయుడు సోమరాజు ‘రాజ్-కోటి’ ద్వయంలో రాజ్. ఈ నాటికీ సంగీతాభిమానులు టి.వి.రాజు బాణీలను మననం చేసుకుంటూ ఆనందిస్తున్నారు.

Show comments