NTV Telugu Site icon

Gopichand: ఆ రోజు రావడం పక్కా!

‘ప్ర‌తిరోజు పండ‌గే’ లాంటి స‌క్సెస్ ఫుల్ మూవీ తర్వాత దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి బ‌న్నీ వాసు నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఆ మధ్య విడుదలైన ‘పక్కా కమర్షియల్’ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని, ఇటీవల విడుదలైన టైటిల్ సాంగ్ టీజర్ కు కూడా మంచి స్పందన వచ్చిందని బన్నీ వాసు తెలిపారు. కరోనా కరుణిస్తే మార్చి 18 లేదా మే 20న వస్తామని గతంలో చెప్పారు. మార్చి 18 వెళ్ళిపోవడంతో మే 20న వస్తారని అంతా అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఆ తేదీన కూడా కాకుండా జూలై 1న రాబోతున్నట్టు తెలుస్తోంది. గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారని, కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారని వాసు చెప్పారు. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి ‘భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే’ వంటి సూపర్ హిట్స్ అందించారు. ‘ప్రతి రోజు పండగే’ సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతం అందిస్తున్నారు.