NTV Telugu Site icon

Reece Thompson: పాతికేళ్ళుగా ‘టైటానిక్’ బుడ్డోడికి రాయల్టీ!

Reece Thompson

Reece Thompson

Reece Thompson: కలిసొచ్చే రోజున మన ఇంటిముందే కనకవర్షం కురుస్తుందంటారు. జేమ్స్ కేమరాన్ తెరకెక్కించిన లవ్ సాగా ‘టైటానిక్’ జనం మదిలో ఈ నాటికీ చెరిగిపోని ముద్ర వేసింది. పాతికేళ్ళ తరువాత కూడా ఈ సినిమా ద్వారా ఓ కుర్రాడు రాయల్టీ పొందుతూ ఉండడం విశేషం! ఇంతకూ ఆ యువకుడు ఈ సినిమాలో నటించే సమయానికి ఐదేళ్ళ బాలుడు. 1997లో ‘టైటానిక్’ సినిమా విడుదలైనప్పటి నుంచీ ఇప్పటి దాకా ఆ అబ్బాయి ఇందులో తాను చెప్పిన ఓ డైలాగ్ కు రాయల్టీ అందుకుంటూనే ఉన్నాడు. ‘టైటానిక్’ చూసిన వారందరికీ అందులో థర్డ్ క్లాస్ ప్యాసింజర్ ఓ బాబు తన తల్లిని “వేర్ ఆర్ వి గోయింగ్ మమ్మీ?” అంటూ ప్రశ్నిస్తాడు. అతని ముద్దు మాటలు అప్పట్లో జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఆ బాబు పెరిగి పెద్దవాడై 30 ఏళ్ళ యువకునిగా ఉన్నాడు. అతని పేరు రీస్ థాంప్సన్.

ఐదేళ్ళ కొడుకు అడిగిన ప్రశ్నకు ఆ కన్నతల్లి తల్లడిల్లిపోతుంది. “మనం వేచి ఉన్నాం. ఫస్ట్ క్లాస్ వాళ్లందరినీ బోట్స్ లో పంపించగానే మనల్ని తీసుకువెళతారు. సిద్ధంగా ఉండు…” అంటూ తల్లి చెబుతుంది. ఆ సీన్ చిన్నదే అయినా, అందులోని ఐదేళ్ళ రీస్ థాంప్సన్ మోము జనం మదిలో ముద్ర వేసింది. ఆ సీన్ చూసిన ప్రేక్షకులు చలించిపోయారు. అందువల్లే ఆ దృశ్యాన్ని అందులో నటించిన చిన్నారి థాంప్సన్ ను మరచిపోలేదు. ఆ సీన్ ఇప్పటికీ పలు మాధ్యమాల్లో హల్ చల్ చేస్తూనే ఉంది. దాంతో థాంప్సన్ కు రాయల్టీ వచ్చి పడుతూనే ఉండడం సాగుతోంది.