అభిరామ్ హీరోగా పరిచయం అవుతుండగా, కమెడియన్ భద్రం సెకండ్ హీరోగా నటించిన సినిమా ‘రెక్కీ 360’. ‘కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు’ అనేది ట్యాగ్ లైన్. దీనిని బట్టే ఈ సినిమా కథ ఎలా ఉంటుందో అర్థమైపోతోంది. ఎన్.ఎస్.ఆర్. ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. ఈ క్రైం థ్రిల్లర్ లో అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఇటీవల ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్‌లో విడుదల చేయగా ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చిందని, తెలుగు తెరపై ఇప్పటివరకు రాని కథాంశానికి ఎవరూ ఊహించని కొన్ని ట్విస్టులు జోడించి దర్శకుడు తెరకెక్కించార’ని నిర్మాత తెలిపారు.
ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా సోమవారం టీజర్ ను విడుదల చేశారు. కేవలం 54 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లోని ప్రతి సన్నివేశం కూడా ఉత్కంఠ రేపుతోంది. చిత్ర కథానేపథ్యం ఎలా ఉంటుందో చెబుతూ ప్రతి ఫ్రేమ్ కూడా ఆసక్తికరంగా మలిచారు. క్రైం నేపథ్యంలో సాగే ఈ కథలో ఊహించని ట్విస్టులు ఉంటాయని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. ఈ చిత్ర రూపకల్పనలో ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ అందించిన మోరల్ సపోర్ట్ కు ఎప్పటికీ రుణపడి ఉంటామని మేకర్స్ పేర్కొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుని, తుది మెరుగులు దిద్దుకుంటున్న’రెక్కీ 360’ని త్వరలోనే జనం ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నాగరాజు ఉండ్రమట్ట, దేవిచరణ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
