NTV Telugu Site icon

ఎన్‌.ఎఫ్.డి.సి., ఫిల్మ్ డివిజన్, సి.ఎఫ్.ఎస్.ఐ. ఇన్ ఛార్జ్ గా రవీందర్ భాకర్

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సి.బి.ఎఫ్.సి.) సీఈఓ రవీందర్ భాకర్ కు కేంద్ర సమాచార ప్రసారశాఖ మరికొన్ని అదనపు బాధ్యతలను అప్పగించింది. నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్.ఎఫ్.డి.సి.) కి ఎండీగా, ఫిల్మ్ డివిజన్‌ కు డైరెక్టర్ జనరల్ గా, చిల్ర్డన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా కు సీఈఓ గా రవీందర్ ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల నియమించింది. ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్ 1999 బ్యాచ్ కు చెందిన రవీందర్ సి.బి.ఎఫ్.సి. సీఈఓగా 2020 జూన్ నుండి బాధ్యతలను నెరవేర్చుతున్నారు. గత కొంతకాలంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ లో ఉన్న సినిమా సంబంధిత శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. రవీందర్ ను ఫిల్మ్ రిలేటెడ్ విభాగాలకు ఇన్ ఛార్జ్ గా నియమించడంతో ఆ ప్రక్రియ సజావుగా సాగే ఆస్కారం ఉంది. సినిమాకు సంబంధించిన వివిధ శాఖలలోని ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతూ, విలీన ప్రక్రియపై దృష్టి పెడతానని, తద్వారా సినిమా రంగానికి మరింత మేలైన సేవలను అందించే అవకాశం ఉంటుందని రవీందర్ చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాలకూ కొత్త రీజనల్ ఆఫీసర్…

రెండు తెలుగు రాష్ట్రాల సి.బి.ఎఫ్‌.సి.కి కొత్త రీజనల్ ఆఫీసర్ ను కేంద్రం నియమించింది. ఇండియన్ రైల్వేస్ లో పనిచేస్తున్న షిఫాలీ కుమార్ (ఐ.ఆర్.టి.ఎస్.) సి.బి.ఎఫ్.సి. ప్రాంతీయ అధికారిణిగా బాధ్యతలు చేపట్టారు. గత యేడాది మార్చిలో సెన్సార్ అధికారిగా వచ్చిన వి. బాలకృష్ణ స్థానంలో ఆమె నియమితులయ్యారు.