మాస్ మహరాజా రవితేజ తాజా చిత్రం ‘ఖిలాడీ’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా… ‘తగ్గేదే లే’ అంటూ ముందుకు సాగిపోతున్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. తాజాగా రవితేజతో ‘ధమాకా’ మూవీని నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు కొత్త షెడ్యూల్ ను షురూ చేశాయి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కు చెందిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ మూవీ విజయపథంలో సాగిపోతుండటంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా ఉంది.
Read Also : RRR Pre Release event : కన్ఫర్మ్ చేసిన టీం… ఎప్పుడు? ఎక్కడంటే ?
ఇక ‘ధమాకా’ విషయానికి వస్తే ఈ కొత్త షెడ్యూల్ ను స్పెయిన్ లో మొదలు పెట్టారు. అందుకోసం ఇప్పటికే యూనిట్ అక్కడకు చేరుకుంది. ఈ షెడ్యూల్ లో భారీ ఎత్తున సాంగ్స్ ను చిత్రీకరించబోతున్నారు. ‘ధమకా’లో రవితేజ సరసన ‘పెళ్ళి సందడి’ భామ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరిపై శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో సాంగ్స్ ను ప్లాన్ చేశారు. ఈ పాటల్లో ఒక దానిని చారిత్రక స్థలం ‘ప్లాజా డి ఎస్పానా’లో చిత్రీకరించబోతున్నట్టు చిత్ర సహ నిర్మాత వివేక్ కూచిబొట్ల తెలిపారు. భీమ్స్ సిసిరిలియో సంగీతం అందిస్తున్న ‘ధమాకా’కు బెజవాడ ప్రసన్న కుమార్ కథ, మాటలు అందిస్తున్నారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు.
