బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా షూటింగ్ మొదలైంది. ఇక ఈ సినిమాలో రవితేజ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడట. గతంలో చిరంజీవితో ‘అన్నయ్య’ సినిమాలో ఆయన తమ్ముడుగా నటించాడు రవితేజ. ఇక రవితేజ ‘డాన్ శ్రీను’కి స్క్రీన్ ప్లే, ‘బలుపు’కి కథ అందించిన కె.యస్. రవీంద్ర అలియాస్ బాబీ రవితేజ ‘పవర్’ సినిమాతోనే దర్శకుడుగా మారాడు. ఇప్పుడు చిరంజీవితోనూ, దర్శకుడు బాబీతోనూ ఉన్న అనుబంధాన్ని పురస్కరించుకుని చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో చిరు సన్నిహితుడి పాత్రలో నటించేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఈ పాత్ర కోసం మాస్ మహారాజా 7 కోట్ల పారితోషికం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ ఏడాది ‘క్రాక్’ బ్లాక్ బస్టర్ హిట్ తో రవితేజ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. తను మీరోగా నటిస్తున్న సినిమాలకు 12 నుంచి 15 కోట్ల వరకూ తీసుకుంటున్నట్లు వినికిడి.
‘క్రాక్’ తర్వాత సెలక్టీవ్ గా సినిమాలు చేస్తున్న రవితేజ నటించిన ‘ఖిలాడి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ‘రామారావు అన్ డ్యూటీ’, ‘ధమాకా’ సెట్స్ మీద ఉన్నాయి. ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న ఔట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’లోనూ రవితేజ పాత్ర కూడా పూర్తి స్థాయిలో ఎంటర్ టైనింగ్ గా ఉంటుందట. వీటన్నింటితో పాటు ‘వాల్తేరు వీరయ్య’ను నిర్మిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్. ఈ బ్యానర్ లో రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా చేశాడు. ఆ సినిమా దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. దానిని కూడా దృష్టిలో పెట్టుకునే చిరంజీవి సినిమా అనగానే ఎలాంటి సందేహం లేకుండా రవితేజ యస్ అనేశాడట. మరి చిరుతో కలసి రవితేజ చేసే సందడి ఎలా ఉంటుందో చూడాలి.
