Unstoppable: నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీలో నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్ సీజన్ 2’లో ఈ వీక్ ఫుల్ గ్లామర్ షోకు ప్రాధాన్యమిచ్చారు. అలనాటి అందాల భామలు జయసుధ, జయప్రదతో పాటు టాలీవుడ్ హాట్ బ్యూటీ రాశీఖన్నా సైతం ఈ షోలో పాల్గొంది. ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’ చిత్రంలో జయసుధ లక్ష్మీదేవిగా, జయప్రద పద్మావతిగా నటించగా, నందమూరి బాలకృష్ణ నారదుడి పాత్ర పోషించి, వారిద్దరితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత కూడా బాలకృష్ణ నటించిన పలు చిత్రాలలో జయసుధ ఉన్నారు. ‘అనురాగదేవత, భారతంలో అర్జునుడు, రూలర్’ వంటి సినిమాలలో వీరు కలిసి నటించారు. అయితే, ‘అధినాయకుడు’లో బాలకృష్ణ భార్యగా జయసుధ నటించడం విశేషం. జయప్రద ‘మహారథి’ చిత్రంలో బాలకృష్ణ అత్తగా యాక్ట్ చేశారు. అయితే ఇటు జయసుధ, అటు జయప్రద ఇద్దరూ మహానటుడు ఎన్టీయార్ సరసన ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో నటించారు. ఇక రాశీఖన్నాకు బాలకృష్ణ సరసన నటించే ఛాన్స్ మాత్రం ఇంకా దక్కలేదు.
విశేషం ఏమంటే… ఈ ముగ్గురితో కలిసి నందమూరి అందగాడు బాలకృష్ణ ఈ షోలో కాలు కలిపి, స్టెప్పులేశారు. తన షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి జయసుధను పెళ్ళి కూతురు చేయడానికి వెళ్ళానని జయప్రద చెప్పగానే, అంటే కాంపిటీషన్ కు కట్ చేయడానికేగా అంటూ బాలకృష్ణ చురక అంటించారు. ఇంతవరకూ నటించిన హీరోలలో ఎవరితో క్రష్ ఉందని రాశీఖన్నాను అడగ్గానే, ఠక్కున ఆమె రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పారు. మరి ఆమె మాటలకు రశ్మికా మందణ్ణ ఫ్యాన్స్ ఏమైనా హర్ట్ అవుతారేమో చూడాలి. మొత్తం మీద బాలకృష్ణ తనదైన శైలిలో స్పాంటేనియస్ గా పంచ్ లు వేసినట్టు తాజాగా విడుదలైన ‘అన్ స్టాపబుల్’ ప్రోమో చూస్తుంటే అర్థమౌతోంది. ఈ ఎపిసోడ్ 23వ తేదీ ఆహాలో టెలికాస్ట్ కాబోతోంది.
https://www.youtube.com/watch?v=EshFnc75GZs
