NTV Telugu Site icon

Ramoji Rao: నిర్మాతగా ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన రామోజీరావు

Ramoji Rao News

Ramoji Rao News

Ramoji Rao Died without fulfilling his goal as Producer: ఈనాడు సంస్థల అధినేతగా అందరికీ సుపరిచితులు అయిన రామోజీరావు ఫిలిం సిటీ నిర్మించడమే కాదు అనేక సినిమాలను నిర్మించారు కూడా. ఉషాకిర‌ణ్ మూవీస్ సంస్థను ఏర్పాటు చేసిన అఆయన ఎన్నో మ‌ర‌పురాని సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. హృద్య‌మైన క‌థ‌ల‌కు ఆ సంస్థ పెట్టింది పేరు అనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ లేకున్నా యువ ద‌ర్శ‌కుల‌కూ, నటీనటులకు అవ‌కాశాలిచ్చి, వారి ప్ర‌తిభ‌ను బ‌య‌ట‌కు తీసుకొచ్చి ఎందరినో తెలుగు సినీ పరిశ్రమకు అందించింది. ఈ సంస్థ చివరిగా దాగుడు మూతలు దండాకోరు అనే సినిమా చేసింది. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఈ సినిమా వచ్చి పోయినట్టు కూడా చాలా మందికి తెలియదు.

Big Breaking: Ramoji Rao : రామోజీ రావు కన్నుమూత!!

ఆ తరువాత నుంచి ఉషాకిర‌ణ్ నుంచి సినిమాలు రావ‌డం లేదు. మిగిలిన వ్యాపారాల్లో క‌నిపించే `లాభం` సినిమాల్లో లేక‌పోయేస‌రికి మెల్ల‌మెల్ల‌గా సినీ నిర్మాణం త‌గ్గించుకుందనే అప్పట్లో టాక్ నడిచింది. అయితే కరోనాకి ముందు అంటే 2019 సమయంలో మ‌ళ్లీ ఉషాకిర‌ణ్ మూవీస్ యాక్టీవ్ అయ్యేందుకు యత్నించింది. అందుకు ఉషాకిర‌ణ్ మూవీస్ సంస్థ కొన్ని క‌థ‌లు కుడా సిద్ధం చేసింద‌ని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఉషాకిర‌ణ్ దాదాపు 85 సినిమాల్ని రూపొందించింది. మ‌రో 15 తీస్తే వంద సినిమాలు తెర‌కెక్కించిన ఘ‌న‌త ద‌క్కుతుందని భావించి ఆ మైలు రాయి కోస‌మైనా సినిమాలు చేయాల‌ని రామోజీరావు అప్పట్లో భావించారు. అయితే అలాగ‌ని ఏ క‌థ‌లు ప‌డితే, ఆ క‌థ‌ల్ని ఎంచుకోకుండా, ఉషాకిర‌ణ్ గ‌త వైభ‌వాన్ని గుర్తుకు తెచ్చేలా సినిమాల్ని రూపొందించాల‌ని అనుకున్నారు.

అప్పట్లోనే ఉషాకిర‌ణ్ సంస్థ ద‌గ్గ‌ర కొన్ని క‌థ‌లు సిద్ధ‌మ‌య్యాయి కూడా. ఆ క‌థ‌ల్ని యువ‌త‌రం ద‌ర్శ‌కుల‌తో తెర‌కెక్కించ‌డానికి సన్నాహాలు కూడా చేశారు. 2016-17 తరువాత తొలి సినిమాతోనే హిట్టు కొట్టిన కొంత‌మంది ద‌ర్శ‌కులకు ఉషాకిర‌ణ్ మూవీస్ నుంచి పిలుపొచ్చింది. కొంత‌మందికి అడ్వాన్సులూ అందాయి, ఈ సినిమాల‌కు రామోజీ రావు నుంచి గ్రీన్ సిగ్న‌ల్ అందింద‌ని కూడా అన్నారు. అయితే కరోనా ఎంట్రీతో అన్ని పరిస్థితులు మారిపోయాయి. అనుకున్న సినిమాలు ఆగిపోయాయి. కరోనా తరువాత తెలుగు ప్రేక్షకులు సినిమాల విషయంలో మనసు మార్చుకున్న తీరు వల్లనో ఏమో కానీ తెరకెక్కించాలి అనుకున్న సినిమాలను కూడా పక్కన పెట్టేశారు. అలా 100 సినిమాలు చేయాలనుకున్న రామోజీరావు నిర్మాతగా ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు.