RamBola Title War: వినాయక చవితి రోజున బాలీవుడ్‌లో ఓ సినిమా ప్రకటన వచ్చింది. అంతే.. కొన్ని గంటల్లో మరో సినిమా ప్రకటనతో ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఊహించని వివాదం మొదలైంది. ఇద్దరు దర్శకులు ఒకే బయోపిక్ ను ప్రకటించడమే కాదు.. ఇద్దరూ ఒకే టైటిల్‌ను ఎంచుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా సాధారణ వ్యక్తి కథ కాదు.. రామచరితమానస్, హనుమాన్ చాలీసా వంటి ఆధ్యాత్మిక సాహిత్యంతో గుర్తింపు తెచ్చుకున్న మహాకవి గోస్వామి తులసీదాస్ జీవితం.
‘హనుమాన్ అంశ్’తో ఇటీవల బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న రచయిత, దర్శకుడు డాక్టర్ విశాల్ చతుర్వేది తన నెక్స్ట్ సినిమాను సెప్టెంబర్ 14న వినాయక చవితి సందర్భంగా ప్రకటించారు. మహావీర్ జైన్ ఫిల్మ్స్‌తో కలిసి తెరకెక్కించనున్న ఈ సినిమాకు ‘రామ్ బోలా’ అనే టైటిల్ పెట్టారు. గోస్వామి తులసీదాస్ జీవితాన్ని, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. విశాల్ చతుర్వేది ఈ సినిమాకు కథ, దర్శకత్వంతో పాటు నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నారు. మహావీర్ జైన్, విశాల్ చతుర్వేది, అమిత్ ఉపాధ్యాయ్, రఘువేంద్ర సింగ్ నిర్మాతలుగా ఉన్నారు.
అయితే ఈ ప్రకటన వచ్చిన సమయంలోనే మరో ‘రామ్ బోలా’ సినిమా వార్తల్లోకి వచ్చింది. జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు డాక్టర్ చంద్రప్రకాశ్ ద్వివేది కూడా గోస్వామి తులసీదాస్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఇదే పేరుతో సినిమా రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అసలు ఒకే కథపై రెండు సినిమాలు ఎలా వచ్చాయి? ఒకే టైటిల్‌ను ఇద్దరు మేకర్స్ ఎలా ప్రకటించారు? అనే చర్చ మొదలైంది.
అయితే ఇదే టైటిల్ విషయంలో చంద్రప్రకాశ్ ద్వివేది అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన ప్రాజెక్ట్‌కు సంబంధించిన ‘రామ్ బోలా’ టైటిల్ ముందుగానే రిజిస్టర్ అయి ఉందని ఆయన చెబుతున్నట్లు సమాచారం. అంతేకాదు, తులసీదాస్ కథకు సంబంధించిన సమాచారాన్ని గతంలో మహావీర్ జైన్‌కు పంపినట్లు కూడా ఆయన పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తనకు సమాచారం ఇవ్వకుండా అదే పేరుతో మరో సినిమా ప్రకటించడంపై ద్వివేది అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఒకే పేరుతో ఇద్దరు టాప్ మేకర్స్ పోటీ పడుతుండటంతో ఈ వివాదం ప్రస్తుతం ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA) వద్దకు చేరినట్లు తెలుస్తోంది. టైటిల్ రిజిస్ట్రేషన్ పత్రాలు ఎవరి దగ్గర సజావుగా ఉన్నాయో పరిశీలించిన తర్వాతే అసోసియేషన్ తుది నిర్ణయం తీసుకోనుంది. ఫిల్మ్ ఛాంబర్ ఇచ్చే క్లియరెన్స్ ఆధారంగానే ఎవరి సినిమా ‘రాంబోలా’ టైటిల్‌తో ముందుకు వెళ్తుందనేది తేలనుంది.

