NTV Telugu Site icon

Rama Prabha: ‘హాస్యరాణి’ రమాప్రభ

Rama Prabha

Rama Prabha

Rama Prabha: ఇప్పుడంటే ముసలి పాత్రల్లో అడపాదడపా తెరపై కనిపిస్తూ ఉన్నారు కానీ, ఒకప్పుడు రమాప్రభ తన హాస్యంతో వెండితెరను భలేగా వెలిగించారు. నిజానికి రమాప్రభ గ్లామర్ అప్పటి తారల అందానికి ఏమీ తీసిపోనిదే. కానీ, ఆమె నవ్వులనే సినీజనం, ఆ పై ప్రేక్షకలోకం ఇష్టపడ్డారు. ఆమె సైతం హాస్యంతోనే అలవోకగా విజయపథంలో సాగారు. నాటి మేటి హాస్యనటులందరి సరసన రమాప్రభ నటించి, నవ్వులు పూయించారు.

రమాప్రభ 1948 అక్టోబర్ 5న జన్మించారు. ఆమె స్వస్థలం అనంతపురం జిల్లాలోని కదిరి. చిన్నతనంలోనే దగ్గరి బంధువులు రమాప్రభను దత్తత తీసుకున్నారు. రమకు పద్నాలుగేళ్ళు వచ్చే వరకు ఊటీలో గడిపారు. తరువాత చెన్నై చేరారు. అక్కడ ఆరంభంలో నాటకాలు వేశారు. తరువాత సినిమాల్లో ప్రయత్నం మొదలెట్టారు. తెలుగులో కంటే ముందుగా తమిళ చిత్రాల్లో నటించారు రమాప్రభ. కె.ప్రత్యగాత్మ తెరకెక్కించిన ‘చిలకా గోరింకా’ చిత్రం ద్వారా రమాప్రభ తెలుగు తెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచీ రమాప్రభ తనకు దొరికిన ప్రతీ అవకాశాన్నీ వినియోగించుకుంటూ సాగారు. ఏ రోజునా ఇలాంటి పాత్రలే చేస్తానని మడికట్టుకు కూర్చోలేదు. ఆమెకు నవ్వులు పూయించే పాత్రలే అధికంగా లభించాయి. దాంతో హాస్యనటిగా గుర్తింపు సంపాదించడంలోనే ఆనందం పొందారు. ఒకానొక సమయంలో రమాప్రభ కాల్ షీట్స్ కోసం నిర్మాతలు, దర్శకులు పడిగాపులు కాచారు. అనేక చిత్రాలలో వాణిశ్రీకి స్నేహితురాలిగా నటించి, ఆమె లాగే రమాప్రభ సైతం స్టార్ స్టేటస్ చూశారు. డబ్బు బాగా సంపాదించిన రమాప్రభ నీడలో ఎందరో సినీజీవులు పబ్బం గడుపుకున్నారు. అడిగిన వారికి లేదనకుండా సాయం అందించేవారు రమాప్రభ. అప్పటి వర్ధమాన నటుడు శరత్ బాబు కూడా అలాగే రమాప్రభ దరి చేరారు. తరువాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. రమాప్రభ ఆస్తులు కరగిపోవడానికి, శరత్ సంపద పెరిగిపోవడానికి కారణాలు ఏమిటో ఎవరికీ తెలియదు కానీ, వారిద్దరూ తరువాత అభిప్రాయభేదాలు వచ్చి విడిపోయారు.

రమాప్రభ హాస్యంతో జనం మదిని దోచిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. రాజబాబు, రమాప్రభ కలసి నవ్వులు పూయించిన చిత్రాలు వసూళ్ళ వర్షం కురిపించాయి. వారిద్దరి జోడీ మొత్తం సినిమాను మోయక పోయినా, ఆ జంట నటిస్తే చాలు తమ దశ మారుతుందని భావించేవారు నిర్మాతలు. దాదాపు పదేళ్ళ పాటు రమాప్రభ, రాజబాబు జోడీ ఆకట్టుకుంది. మాతృభాష తెలుగులోనే కాక, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి వెయ్యికి పైగా చిత్రాలలో నటించారు రమాప్రభ. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తూనే ఉన్నారు. నవతరం ప్రేక్షకులు సైతం రమాప్రభ నటనను అభిమానిస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలోని వాయల్పాడులో ప్రశాంత జీవనం సాగిస్తున్నారు రమాప్రభ. పూరి జగన్నాథ్ వంటి దర్శకులు అడపా దడపా అవకాశాలు కల్పిస్తూనే ఉన్నారు. ఆమె మరిన్ని వసంతాలు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.