Peddi OTT: రూ.400 కోట్ల బ్లాక్‌ బస్టర్‌కు షాక్.. ‘పెద్ది’కి ఓటీటీలో ఊహించని ఎదురుదెబ్బ!

Peddi

Peddi

Peddi OTT: థియేటర్లలో రికార్డులు సృష్టించిన ప్రతి సినిమా ఓటీటీలోనూ అదే స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందని ప్రేక్షకులు భావిస్తుంటారు. అయితే స్ట్రీమింగ్ కు వస్తే మాత్రం వేరే లెక్కలు ఉంటాయి. బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు సాధించిన సినిమా కూడా ఓటీటీలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవచ్చు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ విషయంలో అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ మూవీ, జూలై 9న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత మాత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ జూలై 6 నుంచి 12 వరకు విడుదల చేసిన వ్యూస్ ప్రకారం, విడుదలైన తొలి నాలుగు రోజుల్లో ‘పెద్ది’కి కేవలం 19 లక్షల వ్యూస్ మాత్రమే నమోదయ్యాయి. ఈ గణాంకాలతో ‘పెద్ది’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ నాన్ ఇంగ్లీష్ టాప్ 10 చిత్రాల జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. థియేటర్లలో సునామీ సృష్టించిన సినిమా ఓటీటీలో ఈ స్థానంలో ఉండటం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం కూడా కనిపిస్తోంది. ‘పెద్ది’ తెలుగు సహా పలు దక్షిణాది భాషల్లో అందుబాటులోకి వచ్చినప్పటికీ, హిందీ వెర్షన్‌ను విడుదల చేయలేదు. భారతదేశంలో అత్యధిక ఓటీటీ ప్రేక్షకులు ఉన్న హిందీ మార్కెట్‌ను అందుకోలేకపోవడం ఈ చిత్రానికి ప్రతికూలంగా మారినట్లు కనిపిస్తోంది. థియేటర్లలో హిందీ వెర్షన్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోయినా, ఓటీటీ ప్రేక్షకుల్లో మాత్రం హిందీ డబ్బింగ్‌కు మంచి ఆదరణ ఉండే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితిలో హిందీ వెర్షన్‌ను ఆలస్యం చేయడం వల్ల భారీ సంఖ్యలో ప్రేక్షకులను ఈ సినిమా కోల్పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదే సమయంలో చిన్న చిత్రాలు మాత్రం స్ట్రీమింగ్‌లో పెద్ద విజయాలు సాధించడం ఆసక్తికరంగా మారింది. జూలై 10న విడుదలైన సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా నటించిన కోర్ట్‌రూమ్ డ్రామా ‘ఇక్కా’ కేవలం మూడు రోజుల్లోనే 4.4 మిలియన్ల వ్యూస్ నమోదు చేసి నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా రెండో స్థానంలో నిలిచి తన సత్తా చాటింది. మరోవైపు జూన్ 25న విడుదలైన చిన్న చిత్రం ‘బ్లాస్ట్’ కూడా మొదటి వారాంతంలోనే 4.4 మిలియన్ల వ్యూస్ సాధించి గ్లోబల్ చార్ట్స్‌లో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. భారీ బడ్జెట్ సినిమాలను చిన్న కథలు ఎలా అధిగమిస్తున్నాయో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సినిమా కూడా సరైన డిజిటల్ వ్యూహం లేకపోతే ఆశించిన ఫలితాలను అందుకోలేదని ఈ ఉదాహరణ చెబుతోంది. ఇక హిందీ వెర్షన్ విడుదలైన తర్వాత ‘పెద్ది’ తన వ్యూస్‌ను గణనీయంగా పెంచుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.