Ram Charan మాతృభూమి కోసం సైనికుడిగా మారిన తన బాడీగార్డ్ కు ఓ స్పెషల్ హెల్ప్ చేశారు. ఇంత వరకూ చెర్రీకి బాడీ గార్డ్ గా ఉన్న రస్టీ ఉక్రెయిన్ కు చెందిన వాడు. గత కొన్ని రోజులుగా రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు విడుస్తున్నారు. ఇక రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా పౌరులు కూడా సైన్యంలో చేరాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పిలుపునిచ్చారు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ టైములో చెర్రీకి బాడీగార్డుగా ఉన్న రస్టీ మాతృభూమి కోసం సైనికుడిగామారాడు. అంతేకాదు ఆయన కుటుంబం కూడా యుద్ధం కారణంగా నెలకొన్న పరిస్థితులతో ఇబ్బందులు పడుతోంది.
Read Also : Prakash Raj : “ది కాశ్మీర్ ఫైల్స్” గాయాలను మాన్పుతోందా ? రేపుతోందా?
అయితే ఈ విషయం తెలుసుకున్న చరణ్ తనకు బాడీ గార్డుగా పని చేసిన రస్టీ పరిస్థితిని తెలుసుకుని పరామర్శించారు. అంతేకాకుండా ఆయనకు నిత్యావసర వస్తువులను, డబ్బులు, ఇతర సామాగ్రిని పంపి తగిన సాయం అందించారు. ఈ విషయాన్నీ రస్టీ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో విడుదల చేస్తూ వెల్లడించారు. తన భార్యకు మందులు పంపినందుకు, చరణ్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన తన మాతృభూమిని కాపాడుకోవాలని అన్నారు. రష్యా వల్ల తన దేశం, కుటుంబం పడుతున్న ఇబ్బందులను కూడా ఈ వీడియోలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెర్రీ పెద్ద మనసుపై ప్రశంసలు కురుస్తున్నాయి.
