Jackky Bhagnani: బాలీవుడ్ నటుడు, నిర్మాత, టాలీవుడ్ స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. కొన్ని నెలల క్రితం తన భార్య రకుల్‌తో ఉన్న బంధాన్ని ‘సిచుయేషన్‌షిప్’ అని వర్ణించి వివాదంలో చిక్కుకున్న ఆయన.. ఇప్పుడు ప్రముఖ సెలబ్రిటీ డేటింగ్ యాప్ ‘రాయా’ (Raya) లో ప్రత్యక్షమయినట్లు కొన్ని స్క్రీన్‌షాట్లు రెడ్డిట్‌లో లీక్ అవ్వడం తీవ్ర చర్చలకు దారితీసింది. ఒక ప్రముఖ యూట్యూబర్ తన వీడియో ద్వారా ఈ స్క్రీన్‌షాట్లను మొదట వెలుగులోకి తెచ్చారు. అందులో జాకీ పేరుతో ఉన్న ఒక ప్రొఫైల్ బయోలో “నటుడు/నిర్మాత” అని ఉంది. అయితే, అందులో ‘నిర్మాత’ అనే ఆంగ్ల పదం తప్పు స్పెల్లింగ్‌తో ఉండటం, లొకేషన్ లండన్ అని చూపించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ప్రొఫైల్ నిజంగా జాకీ భగ్నానీదేనా? లేదా ఎవరైనా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారా? అది ఇంకా యాక్టివ్‌గా ఉందా? లేదా? అనే విషయాలపై ఇప్పుడు నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది.
అసలు ఏంటి ఈ ‘రాయా’ డేటింగ్ యాప్..
ఈ రాయా యాప్ అనేది సాధారణ డేటింగ్ యాప్‌ల లాంటిది కాదు. ఇది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, వీఐపీలు మాత్రమే ఉపయోగించే అత్యంత రహస్యమైన, ప్రైవేట్ ప్లాట్‌ఫారమ్. ఇందులో మెంబర్‌షిప్ కావాలంటే ముందుగా అప్లై చేసుకోవాలి. యాప్ నిర్వాహకులు అప్లై చేసుకున్న వాళ్ల బ్యాక్‌గ్రౌండ్ మొత్తం పరిశీలించి, అర్హత ఉందని అనుకుంటే వారి ప్రొఫైల్‌కు యాక్సెస్ ఇస్తారు. అలాంటి యాప్‌లో పెళ్లయిన బాలీవుడ్ ప్రొడ్యూసర్ ప్రొఫైల్ కనిపించడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గత ఏప్రిల్‌లో ఒక ఇంటర్వ్యూలో జాకీ మాట్లాడుతూ.. “నేను, రాకుల్ వివాహం చేసుకున్నాము, కానీ మాది ఒక రకమైన ‘సిచుయేషన్‌షిప్’ ” అని వ్యాఖ్యానించడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. అయితే దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ అప్పట్లోనే ఘాటుగా స్పందించింది. ఒక గంట మాట్లాడిన సంభాషణలో నుంచి కేవలం ఒక్క ముక్కను కట్ చేసి క్లిక్‌బైట్ థంబ్‌నైల్స్‌గా వాడుకుంటున్నారని మండిపడింది. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఆ వ్యాఖ్యలను సందర్భం నుంచి వేరు చేసి వివాదం చేశారని క్లారిటీ ఇచ్చింది. కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో ప్రేమలో పడిన రకుల్ ప్రీత్ సింగ్ – జాకీ భగ్నానీ 2024లో గోవా వేదికగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలపై రకుల్ కానీ, జాకీ కానీ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

