Rajpal Yadav: బాలీవుడ్‌లో తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన నటుడు రాజ్‌పాల్ యాదవ్ ఇప్పుడు చెక్ బౌన్స్ కేసుల్లో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టు ఆయనకు మరో అవకాశం ఇచ్చింది. అయితే ఈసారి కోర్టు ఇచ్చింది సాధారణ గడువు కాదు.. చివరి అవకాశం. బకాయిల చెల్లింపుపై రెండు వారాల్లో స్పష్టమైన ప్రతిపాదన ఇవ్వడంతో పాటు కనీసం రూ.2 కోట్లను సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అంతేకాదు ఆయన గతంలో ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజ్‌పాల్ యాదవ్ గత 15 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సుమారు ₹9 కోట్ల చెక్ బౌన్స్ వివాదంలో నిన్ననే (2026 సెప్టెంబర్ 15న) సుప్రీంకోర్టు ఆయనకు చివరి అవకాశం ఇస్తూ రూ. 2 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశిస్తూ కేసును అక్టోబర్ 5కు వాయిదా వేసింది.
నిజానికి ఈ వివాదం 2010 లో ప్రారంభమైంది. రాజ్‌పాల్ యాదవ్ దర్శకుడిగా మారుతూ తానే స్వయంగా ‘ఆట పాట లపాట’ (Ata Pata Laapata) అనే కామెడీ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా నిర్మాణం కోసం ఢిల్లీకి చెందిన ‘మురళి ప్రాజెక్ట్స్’ (Murali Projects) అనే ప్రైవేట్ సంస్థ నుండి ఆయన ₹5 కోట్ల అప్పు తీసుకున్నారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ కావడంతో ఆయన ఆ అప్పును సకాలంలో తిరిగి చెల్లించలేకపోయారు. వడ్డీలతో కలిపి ఈ మొత్తం దాదాపు ₹9 కోట్లకు చేరింది. ఈ బాకీని సెటిల్ చేయడానికి 2013లో రాజ్‌పాల్ యాదవ్ ఒక్కొక్కటి ₹1.05 కోట్ల విలువైన 7 చెక్కులను ఇచ్చారు. కానీ ఆ చెక్కులన్నీ బ్యాంకులో బౌన్స్ అవ్వడంతో మురళి ప్రాజెక్ట్స్ సంస్థ ఆయనపై చట్టపరమైన కేసులు పెట్టింది. ఈ కేసులో 2018లోనే ట్రయల్ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించగా, తాజాగా 2026 జూలైలో ఢిల్లీ హైకోర్టు కూడా ఆయనకు 3 నెలల జైలు శిక్షను ఖరారు చేసింది. ఇప్పటికే ఆయన ఈ కేసుల కారణంగా తిహార్ జైలులో దాదాపు 4న్నర నెలల పాటు శిక్ష అనుభవించారు.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాజ్‌పాల్ యాదవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టుకు ఇచ్చిన అండర్‌టేకింగ్స్ (హామీలను) ఆయన పదే పదే ఉల్లంఘించడంతో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆయన బాలీవుడ్‌లో డ్రామాలు, యాక్టింగ్ చేయడంలో పర్‌ఫెక్ట్.. కోర్టులో కూడా అదే నటిస్తున్నారు, గత ప్రవర్తన చూస్తే ఎవరూ నమ్మలేరు” అని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. చివరగా ఆయన నిజాయితీని నిరూపించుకోవడానికి రెండు వారాల గడువు ఇస్తూ ₹2 కోట్లు డిపాజిట్ చేయాలని, అలాగే మిగిలిన డబ్బు ఎలా కడతారో పక్కా ప్లాన్ సబ్‌మిట్ చేయాలని ఆదేశించింది. అప్పటివరకు ఆయన అరెస్ట్ కాకుండా రక్షణ కల్పిస్తూనే, పాస్‌పోర్ట్‌ను కోర్టులో సరెండర్ చేయాలని స్పష్టం చేసింది. వరుస కోర్టు విచారణల తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చివరి అవకాశం రాజ్‌పాల్ యాదవ్‌కు అత్యంత కీలకంగా మారింది. అక్టోబర్ 5న ఆయన ఇచ్చే చెల్లింపు ప్రతిపాదన, కోర్టు తదుపరి నిర్ణయం ఈ కేసులో కీలక పరిణామంగా మారనుంది.

