Spy Movie: ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘గ్రే’! ‘ద స్పై హూ లవ్డ్ మీ’ అనేది ట్యాగ్ లైన్. రాజ్ మాదిరాజు దర్శకత్వంలో కిరణ్ కాళ్ళకూరి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా గురువారం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో మీడియా కోసం సినిమాను ప్రదర్శించారు. న్యూక్లియర్ సైంటిస్ట్ సుదర్శన్ రెడ్డి హత్య చుట్టూ అల్లుకున్న స్పై థ్రిల్లర్ మూవీ ఇది. సైంటిస్ట్ సుదర్శన్ రెడ్డి కనిపెట్టిన ఫార్ములాను హస్తగతం చేసుకోవడానికి అమెరికా, రష్యా దేశాల గూఢచార సంస్థలు, ఐ.ఎస్.ఐ. తీవ్రవాదులు ఎలా ప్రయత్నించారు, వారి ఎత్తుగడలను ఇండియన్ ‘రా’ టీమ్ ఎలా చిత్తు చేసింది? అనేది ఇందులోని ప్రధానాంశం. సైంటిస్ట్ సుదర్శన్ రెడ్డిగా ప్రతాప్ పోతన్ (తెలుగులో ఇదే ఆయన చివరి చిత్రం), ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ నాయక్ గా అలీ రెజా, డాక్టర్ రఘు గా అరవింద్ కృష్ణ కీలక పాత్రలు చేశారు. సుదర్శన్ రెడ్డి భార్య ఆరుషీ శర్మ పాత్రతో ఊర్వశీరాయ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. దర్శకుడు రాజ్ మాదిరాజు ‘రా’ చీఫ్ గా ప్రధాన పాత్రను పోషించారు. షాని సాల్మోన్, నజియా, సిద్ధార్థ్ ఇతర పాత్రలలో కనిపిస్తారు.
చిత్ర ప్రదర్శన అనంతరం రాజ్ మాదిరాజు మాట్లాడుతూ, “రెగ్యులర్ స్పై మూవీస్ కు కాస్తంత భిన్నంగా ‘గ్రే’ మూవీని తెరకెక్కించే ప్రయత్నం చేశాం. ఆరేడు దశాబ్దాలుగా వివిధ దేశాలలోని గూఢచారులను, వారి కార్యకలాపాలను, అలానే హఠాత్తుగా అంతర్థాన మౌతున్న సైంటిస్టులు, అనుమానాస్పదంగా కన్నుమూసిన మన దేశ శాస్త్రవేత్తల సమాచారాలను క్రోడీకరించి ఈ కథను రాసుకున్నాం. మనుషులను, వారి మనస్తత్వాలను మనం బ్లాక్ ఆర్ వైట్ గా చూస్తుంటాం. నిజానికి ప్రతి ఒక్కరిలోనూ గ్రే షేడ్ అనేది ఉంటుంది. ఈ సినిమాలోని పాత్రలన్నీ అలాంటివే” అని అన్నారు. ‘తెలుగులో పూర్తి స్థాయి బ్లాక్ అండ్ వైట్ మూవీ వచ్చి నాలుగు దశాబ్దాలు గడిచిపోయిందని, పాత్రల మీద ప్రేక్షకులు ఫోకస్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాను బ్లాక్ అండ్ వైట్ లో తీశామని, పీవీఆర్ వంటి సంస్థ తమ చిత్రాన్ని ప్రదర్శించడానికి ముందుకు రావడం ఆనందాన్ని కలిగించింద’ని నిర్మాత కిరణ్ కాళ్ళకూరి చెప్పారు. ‘గతంలో రాజ్ మాదిరాజు దర్శకత్వంలో ‘ఋషి’ సినిమాలో హీరోగా నటించానని, అలానే ‘ఆంధ్రాపోరి’లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చానని, ఇందులో మరో కీలక పాత్ర పోషించడం ఆనందంగా ఉంద’ని అరవింద్ కృష్ణ అన్నారు. ఈ సినిమాలో అవసరానికి మించి లవ్ మేకింగ్ సీన్స్ ఉన్నాయనే విమర్శలకు వివరణ ఇస్తూ, “ఇదో స్పై మూవీ. వరల్డ్ వైడ్ గా వచ్చిన ఈ జానర్ చిత్రాలలో ఇలాంటి సన్నివేశాలు సర్వసాధారణం. దీనిని కేవలం రొమాన్స్ యాంగిల్ లో చూడడం సబబు కాదు. గూఢచారులు తమ దేశం కోసం వ్యక్తిగత జీవితాన్ని ఏ విధంగా పణంగా పెడుతున్నారో ఈ పాత్రల ద్వారా చూపించాలని దర్శకుడు అనుకున్నారు. అలానే తెరపై చూపించారు. రొమాన్స్ ఎక్కువగా ఉన్న కారణంగానే సెన్సార్ బృందం మా సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇది పెద్దలు చూడాల్సిన సినిమా” అని అన్నారు.
Raj Madiraju: స్పై థ్రిల్లర్ గా ‘గ్రే’!

Grey