చిలిపితనం, చలాకీతనం కలబోసిన రూపంతో రాధిక అనేక చిత్రాల్లో తనదైన బాణీ పలికించారు. ఇప్పుడంటే అమ్మ పాత్రల్లో అలరిస్తున్నారు కానీ, ఒకప్పుడు రాధిక అందం, అభినయం జనాన్ని కట్టిపడేశాయి. ఇక డాన్సుల్లోనూ ఆమె స్పీడును చూసి జనం అబ్బో అన్నారు. కొందరు ఆమె సరసన చిందులు వేయడం చేతకాక బొబ్బలు పెట్టారు. నటిగా అనేక సినిమాలతో జేజేలు అందుకున్నారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో మురిపిస్తూనే ఉన్నారు.
రాధిక 1962 ఆగస్టు 21న మద్రాసులో జన్మించారు. తమిళనాట రంగస్థలంపైనా, కెమెరాముందు మార్తాండుడిలా చెలరేగిపోయిన ప్రముఖ హాస్యనటుడు, విలన్ ఎమ్.ఆర్.రాధ కూతురు రాధిక. తండ్రి బాటలోనే పయనిస్తూ రాధిక, ఆమె చెల్లెలు నిరోషా కూడా నటనలోనే అడుగు పెట్టారు. నిరోషా కంటే రాధిక చాలా రోజులు ముందే కెమెరా ముందు తన ప్రతిభను చాటుకున్నారు. భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన ‘కిళక్కే పోగుమ్ రైల్’ చిత్రం ద్వారా రాధిక సినిమా రంగంలో అడుగు పెట్టారు. ఈ చిత్రంలో మన తెలుగు నటుడు సుధాకర్ హీరో. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తరువాత రాధిక, సుధాకర్ జంట పలు చిత్రాలలో నటించి అలరించారు. ఇక తెలుగునాట చిరంజీవితో తెరకెక్కిన ‘న్యాయం కావాలి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు రాధిక. తొలి చిత్రంతోనే రాధిక నటిగా మంచి మార్కులు సంపాదించేశారు. శోభన్ బాబు, చంద్రమోహన్, మురళీమోహన్, చిరంజీవి వంటి హీరోలతో మంచి విజయాలను చూశారు రాధిక.
తన తొలి తెలుగు చిత్రం హీరో చిరంజీవితో రాధిక నటించిన “కిరాయి రౌడీలు, ఇది పెళ్ళంటారా, బిల్లా-రంగా, యమకింకరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మొండిఘటం, ప్రేమపిచ్చోళ్ళు, పల్లెటూరి మొనగాడు, అభిలాష, శివుడు శివుడు శివుడు, పులి-బెబ్బులి, గూఢచారి నంబర్ 1, సింహపురి సింహం, హీరో, జ్వాల, దొంగమొగుడు, ఆరాధన, రాజా విక్రమార్క” చిత్రాలు అభిమానులను అలరించాయి. చిరంజీవి, రాధిక హిట్ పెయిర్ గా వెలిగారు. చిరంజీవితో అత్యధిక చిత్రాలలో హీరోయిన్ గా నటించిన క్రెడిట్ కూడా రాధికకే దక్కింది. ఇవే కాకుండా రాధిక నటించిన “అనుబంధం, త్రిశూలం, రాముడు కాదు కృష్ణుడు, స్వాతిముత్యం, రాధాకళ్యాణం, మూడుముళ్ళు, జీవనపోరాటం, ముగ్గురు మొనగాళ్ళు, బావమరదళ్ళు, స్వాతికిరణం” వంటి సినిమాలు కూడా అలరించాయి.
తమిళ, తెలుగు, మళయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించిన రాధిక బుల్లితెరపైనా తనదైన మార్కు అభినయం ప్రదర్శించారు. నిర్మాతగానూ అనేక చిత్రాలు నిర్మించారు. రాధిక తనను తాను ఎప్పుడూ బిజీగా ఉంచుకొంటూ సాగుతున్నారు. ఆ మధ్య ‘రాజా ది గ్రేట్’లో రవితేజకు తల్లిగా నటించి అలరించారు రాధిక. ఈ యేడాది శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’లోనూ కీలక పాత్ర పోషించారామె. నాగశౌర్య హీరోగా రూపొందిన ‘కృష్ణ వ్రిందా విహారి’ చిత్రంలోనూ రాధిక నటించారు. ఆ సినిమా విడుదల కావలసి ఉంది. ‘గాలివాన’ వెబ్ సిరీస్ లోనూ తనదైన అభినయంతో ఆకట్టుకున్నారామె. తమిళంలో ఓ ఐదు చిత్రాలలో ఆమె నటిస్తున్నారు. రాధిక మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.