NTV Telugu Site icon

రివ్యూ: పుష్పక విమానం

‘దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ నటించిన మూడో చిత్రం ‘పుష్పక విమానం’. విశేషం ఏమంటే ఈ సినిమాకు విజయ్ దేవరకొండ సమర్పకుడు కాగా, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లితో కలిసి విజయ్ దేవరకొండ తండ్రి గోవర్థన్ రావు దీన్ని నిర్మించారు. దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం వచ్చిన కమల్ హాసన్ సైలెంట్ మూవీ ‘పుష్పక విమానం’ పేరునే దీనికీ పెట్టడంతో సహజంగానే తెలుగు ప్రేక్షకులలో ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది.

సుందర్ (ఆనంద్ దేవరకొండ) ఓ స్కూల్ టీచర్. మీనాక్షి (గీత్ సైనీ)తో అతనికి పెద్దలు పెళ్ళి చేస్తారు. కొత్తగా కాపురం పెట్టిన వారం రోజులకే మీనాక్షి ఓ లెటర్ రాసి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. భార్య లేచిపోయిందనే విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక ఆమె ఇంట్లో ఉన్నట్టుగానే సుందర్ ప్రవర్తిస్తుంటాడు. కొత్తగా పెళ్ళి చేసుకున్న అతని ఇంటికి స్కూల్ స్టాఫ్ భోజనానికి వస్తామని చెప్పడంతో షార్ట్ ఫిల్మ్స్ లో నటించే రేఖ (శాన్వీ మేఘన)ను భార్య గా నటించమని అర్థిస్తాడు. రేఖతో కలిసి సుందర్ ఆడిన భార్యభర్తల నాటకం ఎప్పుడు, ఎలా బయటపడింది? అసలు సుందర్ భార్య నిజంగానే లేచిపోయిందా? ఆమె ఎవరితో, ఎక్కడికి వెళ్ళింది? ఈ మొత్తం వ్యవహారంలో ఎస్.ఐ. రంగం (సునీల్) పాత్ర ఏమిటీ? అనేదే సినిమా.

భార్య లేచిపోవడం, ఆమె లేకున్నా ఉన్నట్టు మేనేజ్ చేయడం, స్కూల్ స్టాఫ్ ఇంటికి వచ్చినప్పుడు వారికి ఆతిధ్యం ఇచ్చే క్రమంలో తయారు చేసిన కామెడీ ఇవన్నీ సినిమా ప్రథమార్ధంను ఆసక్తికరంగానే నడిపించాయి. కానీ ఎప్పుడైతే ఇది మర్డర్ మిస్టరీకి దారి తీసిందో అక్కడి నుండి కథ గాడి తప్పింది. లేచిపోయిన భార్యను వెతికే క్రమంలో సుందర్ పడే తిప్పలు నవ్వు తెప్పిస్తాయి. ఆమె కనిపించకుండా పోయిన తర్వాత జరిగే సంఘటనలు ఆడియెన్స్ లో క్యూరియాసిటీని కలిగిస్తాయి. అయితే పోలీసులు సుందర్ ను అరెస్ట్ చేయడం, హింసించడం వంటి సంఘటనలు పరమ రొటీన్ గా ఉన్నాయి. అలానే మాజీ ప్రియుడి దగ్గరకు మీనాక్షి వెళ్ళడం, ఆ పైన మనసు మార్చుకుని తిరిగి రావడం ఏ మాత్రం కన్వెన్సింగ్ గా లేదు. ఇక తిరిగి వచ్చిన తర్వాత జరిగే ఉపద్రవం సైతం చాలా చాలా సినిమాటిక్ గా ఉంది. చాలా లూప్ హోల్స్ తో కథను గజిబిజిగా నడిపేసి, దర్శకుడు చివరకు ముగింపుకు తీసుకెళ్ళిపోయాడు. ప్రేక్షకుల ఊహకు అందని ముగింపు ఇవ్వాలని డైరెక్టర్ భావించడంలో తప్పులేదు కానీ ఆ సంఘటనలను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. దాంతో ఏదో కథ నడుస్తోందనే భావన ప్రేక్షకులకు కలుగుతుంది తప్ప, తెర మీద సన్నివేశాలతో వాళ్ళు కనెక్ట్ కాలేరు.

నటీనటుల విషయానికి వస్తే ఆనంద్ దేవరకొండ నటన ఫర్వాలేదు. డైలాగ్ డెలివరీలో మాత్రం ఇంకా ఇంప్రూవ్ కావాల్సి ఉంది. మీనాక్షిగా గీత్ సైనీ కనిపించేది కాసేపే అయినా బాగానే ఉంది. రేఖగా శాన్వీ మేఘన చాలా హుషారుగా నటించింది. మరీ ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో ఆమె నటన సూపర్. ఎస్.ఐ. రంగంగా సునీల్ బాగానే చేశాడు. అయితే వరుసగా పోలీస్ ఆఫీసర్ పాత్రలు చేసినా కొంత మెనాటనీ అనిపించే ఆస్కారం ఉంది. ఇతర ప్రధాన పాత్రలను నరేశ్, హర్షవర్థన్, కిరీటి దామరాజు, గిరిధర్, అభిజిత్, షేకింగ్ శేషు, సివిఎల్ నరసింహారావు, శరణ్య, మీనా వాసు తదితరులు పోషించారు. వైవా హర్ష, భద్రమ్ కాస్తంత కామెడీని పండించడానికి ట్రై చేశారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్ వర్ష బొల్లమ్మ క్లయిమాక్స్ లో ఓ మెరుపులా మెరిసింది.

ఈ సినిమాకు బాణీలను రామ్ మిరియాల, సిద్ధార్థ్ సదాశివుని, అమిత్ దాసని సమకూర్చారు. రామ్ మిరియాల ఓ పాటలో గెస్ట్ అప్పీయరెన్స్ కూడా ఇచ్చాడు. మార్క్ కె. రాబిన్ నేపథ్య సంగీతం ఓకే. పాటలను కాస్తంత భిన్నంగా తెరపై ప్రెజెంట్ చేయడానికి దర్శకుడు దామోదర తాపత్రయ పడిన విషయం అర్థమౌతోంది. కథానుగుణంగా సినిమా మినిమమ్ బడ్జెట్ లోనే తీసినట్టు తెలుస్తోంది. ఏదేమైనా బలమైన కథను ఎంపిక చేసుకోకపోవడం, దాన్ని కన్వెన్సింగ్ గా చెప్పకపోవడం ఈ సినిమాకు సంబంధించిన ప్రధానమైన లోటు. డార్క్ కామెడీని ఇష్టపడే వారికి ఈ సినిమా ఓ మేరకు నచ్చే ఆస్కారం ఉంది. కానీ ఆనంద్ దేవరకొండ గత రెండు చిత్రాలను దృష్టిలో పెట్టుకుని థియేటర్లకు వెళితే మాత్రం నిరాశకు గురికాక తప్పదు.

ప్లస్ పాయింట్స్
సిట్యుయేషనల్ కామెడీ
నటీనటుల నటన
నేపథ్య సంగీతం

మైనెస్ పాయింట్స్
ఆకట్టుకోని కథ, కథనం
బలహీనమైన సన్నివేశాలు

రేటింగ్: 2.25 / 5

ట్యాగ్ లైన్: ఎగరని ‘పుష్పక విమానం’