Puri Jagannadh: ప్రభాస్ పేరు చెప్పగానే బ్యాంకాక్ హాస్పిటల్‌లో వీఐపీ ట్రీట్‌మెంట్.. పూరి చెప్పిన ఆసక్తికర ఘటన

Puri Jagannadh1

Puri Jagannadh1

Puri Jagannadh: ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన చిత్రాల్లో ‘బాహుబలి’ ఫ్రాంచైజీ ఒకటి. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ రికార్డులనే కాదు, విదేశాలకు కూడా ఇండియన్ సినిమా పవర్ చూపించింది. ఆ ప్రభావానికి సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటనను తాజాగా నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన ‘Baahubali: The Torch Bearer’ డాక్యుమెంటరీలో హీరో ప్రభాస్ పంచుకున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్‌కు బ్యాంకాక్‌లో జరిగిన ఈ అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘బాహుబలి’ తొలి భాగం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమయంలో, రెండో భాగం షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొనసాగుతోంది. అదే సమయంలో చిన్న ఇన్ఫెక్షన్‌కు చికిత్స కోసం పూరి జగన్నాథ్ బ్యాంకాక్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వెయిటింగ్ ఏరియాలో కూర్చుని ఉండగా, ఓ నర్స్ ఆయనను భారతదేశం నుంచి వచ్చారా అని అడిగిందట. పూరి అవునని చెప్పగానే ఆమె వెంటనే “బాహుబలి?” అని ప్రశ్నించిందని ప్రభాస్ గుర్తు చేశారు.

దానికి ఆశ్చర్యపోయిన పూరి, అక్కడ కూడా ‘బాహుబలి’ గురించి అందరికీ తెలుసా అని అడగగా, ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బంది సహా చాలామంది ఆ సినిమా చూసి ఎంతో ఇష్టపడ్డారని నర్స్ చెప్పిందట. వెంటనే తన మొబైల్‌లో ప్రభాస్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను చూపిస్తూ, తాను ప్రభాస్‌కు సన్నిహిత మిత్రుడినని పూరి తెలిపారట. ఆ ఫొటోను చూసిన నర్స్ వెంటనే చీఫ్ డాక్టర్‌కు చూపించగా, పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని ప్రభాస్ వివరించారు. సాధారణ క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పూరి జగన్నాథ్‌ను నేరుగా ప్రత్యేక గదికి తీసుకెళ్లి వెంటనే చికిత్స అందించారని తెలిపారు. ప్రభాస్‌కు సన్నిహితుడనే కారణంతో ఆస్పత్రి సిబ్బంది ఆయనకు ప్రత్యేక మర్యాదలు చూపించారని ఈ డాక్యుమెంటరీలో వెల్లడైంది.

చికిత్స పూర్తయిన తర్వాత ఈ సంఘటనను పూరి జగన్నాథ్ వాయిస్ మెసేజ్ రూపంలో ప్రభాస్‌కు పంపించారట. ఆ సమయంలో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి షూటింగ్‌లో ఉన్న ప్రభాస్, ఈ విషయం విని అందరూ ఆశ్చర్యపోయారని చెప్పారు. జపాన్‌లో ‘బాహుబలి’కి అపారమైన ఆదరణ ఉందని ముందే తెలిసినా, థాయ్‌లాండ్‌లోని ఓ సాధారణ ఆస్పత్రి సిబ్బందికీ ఆ సినిమా, ప్రభాస్ గురించి అంత పరిచయం ఉండటం తమకు ఆశ్చర్యం కలిగించిందన్నారు.

ఇదిలా ఉండగా, ఇదే డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి చేసిన వ్యాఖ్యలు ‘బాహుబలి 3’పై కూడా అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తించాయి. అధికారిక ప్రకటన ఏదీ లేకపోయినా, భవిష్యత్తులో ఈ ఫ్రాంచైజీ కొనసాగవచ్చనే సంకేతాలు కనిపించాయని అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న ‘స్పిరిట్’, అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలోని ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ వంటి భారీ ప్రాజెక్ట్‌లతో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో ‘బాహుబలి’ డాక్యుమెంటరీలో బయటకు వచ్చిన ఈ అరుదైన సంఘటన మరోసారి ప్రభాస్ గ్లోబల్ క్రేజ్‌ను చర్చనీయాంశంగా మార్చింది.